Anam Ram Narayana Reddy : మాజీ మంత్రి ఆనం నారాయణరెడ్డి మంగళవారం మరోసారి ప్రభుత్వ తీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. సచివాలయ సిబ్బంది ఎక్కడ కూర్చొని పనిచేయాలో అర్ధం కావడం లేదన్నారు. అద్దె భవనాలు, అంగన్ వాడీ కార్యాలయాల్లో కార్యక్రమాలు పెట్టుకుంటున్నారని ఆయన చెప్పారు. నిధులు మంజూరు చేసినా భవనాలు పూర్తి కాలేదన్నారు. కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.
సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారని ఆనం అన్నారు. అధికారులను అడిగితే త్వరలోనే పూర్తి చేస్తామని చెబుతున్నారని, అవి పూర్తి అయ్యే లోపు తమ పదవీకాలం పోతుందన్నారు. ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అయితే ఎన్నికలు వస్తే తామంతా ఇంటికి పోవడం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేసారు.
ఇటీవలే ఆనం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం నిధులిస్తేనే నీళ్లిచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చలేకపోతున్నామన్నారు.నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశామని ఆనం నారాయణ రెడ్డి ప్రశ్నించారు. పెన్షన్లు ఓట్లు కురిపిస్తాయా అని ఆయన వ్యాఖ్యానించారు.ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చేందుకే తాను ఇలా మాట్లాడుతున్నానని అన్నారు.