Chegondi Hariramayya Jogaiah: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మండిపడ్డారు. ముద్రగడని ఇంతకాలం పెద్ద మనిషి అనుకున్నానని, పవన్ కళ్యాణ్‌పై ఎక్కుపెట్టిన బాణాలతో ముద్రగడపై ఉన్న నమ్మకానికి తూట్లు పొడిచినట్లైందని జోగయ్య విమర్శించారు. మంత్రి పదవులకి ఆశపడో లేక ప్రలోభాలకి లొంగో అవినీతి చక్రవర్తి జగన్ మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్న కొంతమంది కాపు నేతల లైన్‌లో ముద్రగడ కూడా చేరినట్లయిందని జోగయ్య ఘాటుగా విమర్శించారు.
కాపులకోసం ఆయన చేసిన ఉద్యమాలు చిత్తశుద్ధితో చేసినవే అని నమ్మానని, కానీ అవి కూడా రాజకీయ లబ్ధికోసం చేసినవే అని అర్థమైందని జోగయ్య అన్నారు. కాపుల రిజర్వేషన్లు ఇవ్వలేనన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలని ఖండిస్తూ ఎందుకు ప్రకటన ఇవ్వలేదో ముద్రగడ చెప్పాలని జోగయ్య నిలదీశారు. ఆ రోజుల్లో తెరవెనుక వైసీపీకి మద్దతిచ్చి తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా నటించి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకి సైతం కాపుల ఓట్లు పడకుండా చేసింది ముద్రగడ కాదా అని ప్రశ్నిస్తున్నానని జోగయ్య అన్నారు.
కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని గంగలో కలిపి మధ్యలో రాజీనామా చేసి కాపులకి అన్యాయం చేసింది మీరు కాదా అని అడుగుతున్నానని జోగయ్య నిలదీశారు. కాపు కులస్తుడైన పవన్ కళ్యాణ్‌పై అభాండాలు వేసి రాజ్యాధికారం కోరుకుంటున్న లక్షలాది కాపు కులస్తుల లక్ష్యాన్ని చెడగొట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నం వెనుక కాపు వ్యతిరేకి జగన్ హస్తం లేదా అని అడుగుతున్నానని జోగయ్య ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాపు కులంలో పుట్టినవాడెవడైనా ఇలాంటి దుశ్చర్యకి పాల్పడతాడా అని అడుగుతున్నానని జోగయ్య చెప్పారు.
కాపులకి రాజ్యాధికారమే మీరు చిత్తశుద్ధితో కోరుకుంటే మీరు కాని, మరో సమర్ధుడైన కాపు కులస్తుడిని కాని వైఎస్సార్ పార్టీ తరపున రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా పోటీలోకి దించడానికి జగన్ని ఒప్పించగల దమ్ము మీకుందా అని జోగయ్య అడిగారు. ద్వారంపూడి అక్రమాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడటాన్ని ముద్రగడ ప్రశ్నించాల్సిన అవసరం లేదని జోగయ్య కరాఖండిగా చెప్పారు. సిఎం కావాలంటే 175 నియోజకవర్గాల్లో పోటీ పెట్టగల సత్తా ఉండి మెజారిటీ సంపాదించవలసిన పని లేదని, కింగ్ మేకర్ అవగల సీట్లు గెలిచినా రాష్ట్ర పరిపాలన చేపట్టవచ్చన్న ఇంగితజ్ఞానం కూడా లేకపోతే రాజకీయాలు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదని జోగయ్య నిశితంగా విమర్శించారు.కాకినాడలో పోటీకి దిగి పవన్ కళ్యాణ్‌ని సవాల్ చేశావు కదా.? నీ సొంత నియోజకవర్గం అయిన ప్రత్తిపాడులో ఇండిపెండెంట్‌గా కానీ, వైసీపీ తరపున కానీ నిలబడి నెగ్గితే మీ పరపతి ఎంతో చూసి సంతోషిస్తామని జోగయ్య కాపు నేత ముద్రగడకి సవాల్ విసిరారు. అనవసరంగా వైసీపీలో చేరి అభాసుపాలు కాకండి. మీకున్న కొద్దిపాటి పరపతికూడా కోల్పోతారని జోగయ్య హితవు పలికారు. టీడీపీతో కానీ బీజేపీతో కానీ పొత్తు లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించలేదని జోగయ్య గుర్తు చేశారు.
పొత్తులు ఉన్నా సిఎం తానే అని పవన్ కళ్యాణ్ ప్రకటించడం సంతోషమే కదా అని జోగయ్య ప్రశ్నించారు. పదవుల పందేరం ఇప్పటినుంచీ జరిగే ప్రక్రియ కాదని, సిఎం పదవి తనకి దక్కితేనే పొత్తులు అనే సందేశాన్నే పవన్ కళ్యాణ్ ఇచ్చారని జోగయ్య వివరించారు. మీరు పవన్ కళ్యాణ్‌పై చేస్తున్న అభియోగాలు రాజకీయ లబ్ధి కోరి చేస్తున్నవని, జగన్ ని రక్షించడానికే ఈ పని చేస్తున్నారని అభియోగం మోపవలసి వస్తుందని ముద్రగడ పద్మనాభాన్ని జోగయ్య హెచ్చరించారు. ఇకముందు ఇలాంటి పనులు చేయకుండా నోరు మూసుకుని కూర్చుంటే అంతా సంతోషిస్తారని ముద్రగడకి జోగయ్య సలహా ఇచ్చారు.