Kishan Reddy : ప్రైమరీ హెల్త్ సెంటర్లో మూడు నెలల నుంచి కరెంట్ లేకపోతే..అధికారులంతా ఏం చేస్తునారని కేంద్ర మంత్రి జి. కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులు, పేషెంట్ల బాధలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్ ఉషోదయ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసారు. అనంతరం అక్కడి పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాన్ని సందర్శించారు. రోగుల ఇబ్బందులు, వసతుల కొరత, వైద్య సేవల గురించి ఆరా తీశారు.
ఆసుపత్రిలో మొత్తం చీకటి ఉండటాన్ని గమనించిన కేంద్ర మంత్రి ఇదేమిటని ప్రశ్నించారు. మూడు నెలలుగా వైరింగ్ కాలిపోయి కరెంట్ లేక అంధకారంలొనే విధులు నిర్వర్తిస్తున్నామని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి.. ఉన్నతాధికారితో ఫోన్ చేశారు. మూడు నెలల నుంచి కరెంట్ లేకుంటే మీరు ఏం చేస్తున్నారు? గర్భిణులు, చిన్న పిల్లల ఇబ్బందులు, డాక్టర్ల కష్టాలు కనిపించడం లేదా? భారత ప్రభుత్వం కూడా పీహెచ్ సీలకు డబ్బులు ఇస్తున్నది కదా? ఎందుకు మరమ్మతు చేయించడం లేదు? అని ప్రశ్నించారు.
అలాంటిదేమీ లేదన్న ఉన్నతాధికారిణి.. ఇవ్వాలే పనులు మొదలు పెట్టి కరెంట్ వచ్చేలా చూస్తానన్నారు. డబ్బులు లేకుంటే తన దృష్టికి తీసుకురావాలి కానీ.. విధులపట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కిషన్ రెడ్డి హెచ్చరించారు. అనంతరం పలువురు పేషంట్లు, మహిళలతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు.