TSPSC: టీఎస్ పీఎస్సీ నిర్వహించాల్సిన అర్హత పరీక్షలు ఆకస్మికంగా వాయిదా పడ్డాయి. టౌన్‌ప్లానింగ్, పశు సంవర్థక శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈవారం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించాల్సిన అర్హత పరీక్షలు వాయిదాపడ్డాయి.
హ్యాకింగ్ ఎఫెక్ట్..
రాష్ట్రంలోని పలు విద్యార్ధుల్లో గందరగోళం నెలకొంది. టీఎస్ పీఎస్సీ నిర్వహించే పరీక్షలు హ్యాకింగ్ గురయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు.. పబ్లిక్ కమిషన్ వెంటనే పరీక్షలను వాయిదా వేసింది. ఈ నెల 12న ఓ పరీక్ష ఉండగా.. దానికి సంబంధించిన సమాచారం బయటకు పొక్కిందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో కమిషన్ అధికారుల కంటే ముందుగా ఈ వివరాలను ఎవరో పరిశీలించినట్లు అంచనాకు వచ్చారు. దీంతో ముందు జాగ్రత్తగా పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించారు. అభ్యర్థులకు సంక్షిప్త సమాచార ద్వారా పరీక్షను రద్దు చేసినట్లు తెలిపారు. మరోవైపు ఈ నెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
పోలీసు కేసు నమోదు (TSPSC)
పరీక్ష నిర్వహణలో హ్యాకింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. టీఎస్‌పీఎస్సీ కమిషన్‌కు సంబంధించిన గోప్యతతో కూడిన ఫైళ్లు కంప్యూటర్‌లో తెరిచి ఉన్నట్లు అనుమానించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీస్ విభాగం అధికారులతో కలిసి విచారణ ప్రారంభించారు.
పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన వంటి అంశాల్లో టీఎస్‌పీఎస్సీ ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో కమిషన్ పరపతి దెబ్బతింటుందనే భావనతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
పేపర్ లీక్‌లో కొత్త కోణం..
ఈ పేపర్ లీక్ లో కొత్త కోణం బయటకు వచ్చింది. కమిషన్‌కు చెందిన ఓ ఉద్యోగి.. ఓ యువతి కోసం పేపర్ లీక్ చేసినట్టు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి ఇటీవల ఓ యువతి తరచుగా రావాడాన్ని అధికారులు గమనించారు. ప్రవీణ్ అనే వ్యక్తి కోసం యువతి తరచూ వస్తుంది. ఆ యువతి.. టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్‌కు గాలం వేస్తూ సన్నిహితంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె కోసం పేపర్ లీక్ చేసినట్టు గుర్తించారు. యువతి కోసం టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీ జరిగిందని అధికారులు నిర్ధారించారు. దీంతో, నిందితుడు ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.