Site icon Prime9

JC Prabhakar Reddy: ఈడి రూపంలోనే దేవుడు.. కేసు పెట్టినందుకు సంతోషం.. జేసీ ప్రభాకర్ రెడ్డి

ED

ED

ED: తమపై ఈడీ విచారణ చేయడం చాలా సంతోషంగా ఉందని ఈడి రూపంలోనే దేవుడు ఉన్నాడని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో ఆయనకు చెందిన రూ.22 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ బుధవారం వెల్లడించింది. దీనిపై ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అశోక్ లేల్యాండ్ తమకు వాహనాలు అమ్మకపోతే అసలు ఈ స్కామే లేదని అన్నారు.

ఈ స్కామ్‌లో అశోక్ లేల్యాండ్ పాత్రపై కూడా విచారణ చేస్తామని ఈడీ చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు అశోక్‌ లేలాండ్‌తో పాటు, తాడిపత్రి ఆర్టీఏ అధికారులు, నాగాలాండ్‌లోని ఆర్టీఏ అధికారుల మొత్తం కథ బయటకు వస్తుందని అన్నారు. తప్పుడు కేసు పెట్టినందుకు చాలా మంది పోలీసులు కూడా ఇందులో ఇరుక్కుంటారని అన్నారు.
ఈ కేసులో ఈడీ ఆస్తులు అటాచ్ చేసిన జాబితాలో జేసీ ప్రభాకర్‌ రెడ్డికి చెందిన దివాకర్‌ రోడ్‌ లైన్స్‌, జటాధర్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, తాడిపత్రికి చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ గోపాల్‌ రెడ్డికి చెందిన సి.గోపాల్‌ రెడ్డి అండ్‌ కంపెనీకి చెందిన ఆస్తులు ఉన్నాయి. వీటిలో నగదు, బ్యాంకు బ్యాలెన్సులు, ఆభరణాలు తదితర చరాస్తులు రూ.6.31 కోట్లతోపాటు రూ.15.79 కోట్ల విలువైన 68 స్థిరాస్తులు ఉన్నాయని ఈడీ తెలిపింది.

బిఎస్‌-3 వాహనాలను 2017 ఏప్రిల్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అశోక్‌ లైలాండ్‌కు సంబంధించిన 153 వాహనాలను జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్‌రెడ్డి రెండు వేర్వేరు కంపెనీల పేరుతో తుక్కు కింద కొనుగోలు చేసి 2018లో నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ వాహనాలను తరువాత ఆంధ్రప్రదేశ్‌కు బదిలీపై తెచ్చారు. ఇక్కడా రిజిస్ట్రేషన్‌ చేశారు. 2019లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిపై విచారణ చేపట్టింది. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసిన వారిపై రవాణా శాఖ అప్పట్లో కేసులు నమోదు చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడ్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Exit mobile version