Basara: నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో మరో వివాదం చోటు చేసుకుంది. సరస్వతి దేవి అభిషేకం లడ్డూలకు ఫంగస్ సోకింది. ఫలితంగా వేల సంఖ్యలో లడ్డూలు పాడయ్యాయి. ఒక్కో అభిషేకం లడ్డూ ధర 100 రూపాయలుగా ఉంది. జరిగిన దాన్ని గమనించిన అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పాడైన లడ్డూలని మాయం చేసేందుకు ప్రయత్నించారు.
లక్షలాది రూపాయల నష్టం..(Basara)
మిగిలిన కొన్నింటిని ఆరబెట్టే ప్రయత్నం చేశారు. ఆలయ సిబ్బంది నిర్వాకంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది.ఈనెల 20న అమ్మవారి మూలా నక్షత్రంతో పాటు,,, దుర్గా దేవి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారు కొలువుదీరుతారు. దీనితో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి చిన్నారులకు అక్షర స్వీకార మహోత్సవాలు,,అమ్మవారి దర్శనం చేసుకుంటారని అధిక సంఖ్యలో ఆలయ అధికారులు లడ్డూలను తయారు చేయించారు. కానీ ఈ ఏడాది భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో భారీగా లడ్డు విక్రయాలు కొనసాగలేదు.
ఇలా ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించి లడ్డూలు పాడయ్యేలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, స్దానికులు కోరుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రసాదం తయారు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వారు అధికారులకు సూచించారు. ఈ ఏడాది జనవరిలో భద్రాచలం రాములవారి ఆలయంలో కూడా ముక్కోటి ఏకాదశి నాడు ఇదే తరహా సంఘటన జరిగింది. దీనితో ఆగ్రహానికి గురైన భక్తులు ప్రసాదం కౌంటర్ వద్ద ఇక్కడ బూజు పట్టిన లడ్డూలు అమ్మబడును అంటూ రాసివున్న కాగితాన్ని అంటించారు.