Former Minister Mallareddy: కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు వివాదంలో ఉన్న మాజీమంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన స్థలాన్నికొందరు ఆక్రమించుకుంటున్నారని వారు ఆరోపించారు. అంతేకాకుండా స్థలంలో వేసిన ఫెన్సింగ్ ను మల్లారెడ్డి అనుచరులు తొలగిస్తున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయగా.. పోలీసులతో మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు.
ఫెన్సింగ్ తీయమంటూ ఆదేశాలు.. ( Former Minister Mallareddy)
సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఈ భూ వివాదం నెలకొంది. ఇక్కడ రెండున్నర ఎకరాల భూమి తనదేనని మాజీ మంత్రి మల్లారెడ్డి వాదిస్తుండగా అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. తాము ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేసామని వారు చెబుతున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు అంటున్నారు. ఇలా ఉండగా కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటనా స్దలంలో ఎలాంటి గొడవలు చేయవద్దని ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెబుతున్నారు. ఇలాఉండగా పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను ఫెన్సింగ్ తీయాలంటూ ఆదేశించారు. ఈ సందర్బంగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించారు.