MP Dharmapuri Aravind : ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేయండి.. హైకోర్టులో బీజీపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పిటిషన్

తనను చంపుతానని మీడియా సాక్షిగా బెదిరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పిటిషన్ దాఖలు చేశారు.

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 05:55 PM IST

MP Dharmapuri Aravind: తనను చంపుతానని మీడియా సాక్షిగా బెదిరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. తనను బెదిరించడంతో పాటు తన కుటుంబసభ్యులను అవమానించిన ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.ఈ పిటిషన్ ను జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారించనుంది. అరవింద్ తరఫున అడ్వొకేట్ రచనా రెడ్డి వాదనలు వినిపించనున్నారు.

ఈ నెల 18న టీఆర్ఎస్ శ్రేణులు హైద్రాబాద్ ఎమ్మెల్యే కాలనీలోని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై దాడి చేశారు.ఈ దాడిలో అరవింద్ నివాసంలో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. అంతేకాదు అరవింద్ నివాసంలో ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ధర్మపురి అరవింద్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్సీ కవిత ఎంపీ అర్వింద్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నానంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే… నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి ఓడిస్తామని హెచ్చరించారు. అర్విందే కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నాడని చెప్పారు. ఒక మహిళపై అరవింద్ ఇలా మాట్లాడటమేంటని ప్రశ్నించిన కవిత అర్వింద్ ఇంకోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే కొట్టి చంపుతామని హెచ్చరించారు.