BRS MLC: అధికారంలో ఉన్నన్నాళ్లు బిఆర్ఎస్ అధిష్టానం నిర్ణయాలని ప్రశ్నించని ఆ పార్టీ నేతలు నెమ్మదిగా గళం విప్పడం ప్రారంభించారు. అధినేత నిర్ణయాలని తప్పుబట్టడం మొదలు పెట్టారు. కొన్ని జిల్లాల్లో తమ ఎమ్మేల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు అంగీకరించారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఎమ్మెలేలపై ఉన్న అసంతృప్తిని ఎలా మేనేజ్ చేయాలో పార్టీకి సరైన ప్లాన్ లేకపోతే దానిని ఎలా మేనేజ్ చేస్తామని తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ప్రశ్నించారు.
వాస్తవాలు వినే అవకాశం ఇస్తే..(BRS MLC)
పార్టీ అధినేత వాస్తవాలు వినే అవకాశం ఇస్తే ఎవరైనా ఉన్నది ఉన్నట్లు చెబుతారని తక్కెళ్ళపల్లి అన్నారు. వాస్తవాలు చెప్పే వారు బయట, జోకుడు గాళ్ళు లోపల ఉంటే ఎలా వాస్తవాలు తెలుస్తాయని రవీందర్ రావు అన్నారు. వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదని కుక్కలు కూడా వారి వెంట పడవని తక్కెళ్ళపల్లి చెప్పారు. వరంగల్ ఆత్మ గౌరవం ఉన్న జిల్లా అని అలాంటి ప్రాంతంనుంచి ఎర్రబెల్లి, సత్యవతికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధ పడ్డారని తక్కళ్ళపల్లి అన్నారు.
1983 లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన తక్కళ్లపల్లి రవీందర్ రావు.. 2007 లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచీ బీఆర్ఎస్ బలోపేతం అయ్యేందుకు.. నిరంతరం తన శాయశక్తులా పోరాడారు. అయితే బీఆర్ఎస్ తన స్వయంకృతాపరాధం వల్లే ఓడిపోయిందనే ఆవేదనతోనే, తక్కళ్లపల్లి రవీందర్ రావు మీడియా ముఖంగా.. కేసీఆర్ తప్పిదాలను, బీఆర్ఎస్ నేతల అక్రమాలను బయట పెట్టారని, రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.