Actress Hema Arrested: రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో రేవ్ పార్టీ సంచలనం సృష్టించింది. ఈ పార్టీలో పలువురు ఏపీకి చెందిన వారు ఉన్నారని వార్తలు వచ్చాయి. నటి హేమ కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి.
మొదటిసారి విచారణకు హాజరుకాని హేమ..(Actress Hema Arrested)
పోలీసులు అధికారికంగా ప్రకటించినా.. హేమ ఆ పార్టీలో పాల్గొనలేదని బుకాయించింది. దీంతో బ్లడ్ శాంపిల్స్ తీసుకొని అందులో హేమ డ్రగ్స్ వాడినట్టు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో బెంగుళూరు పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. అయితే నటి హేమ విచారణకు డుమ్మా కొట్టింది. మొదటి సారి ఇచ్చిన నోటీసులకు అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేను అని లేఖ పంపింది హేమ. రెండవ సారి నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ రోజు బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరైంది. దీంతో విచారణ అనంతరం హేమను అరెస్ట్ చేసిన పోలీసులు.. రేపు కోర్టులో హాజరుపర్చనున్నారు.
100 మందికి టెస్ట్ చేయగా 86 మందికి పాజిటివ్..
హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ వినియోగం కేసులో నటి హేమను సీసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.వైద్య పరీక్షల అనంతరం హేమను సీసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం 7 రోజుల కస్టడీ కోరే అవకాశం ఉంది. ఈ కేసులో మొత్తం 100 మందికి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఇందులో ఎక్కువగా తెలుగువారు, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉండడంతో సినీ పరిశ్రమను షేక్ చేసింది. ఈ కేసులో ప్రముఖంగా నటి హేమ పేరు మార్మోగింది.