AP Ration Card E-KYC Update Deadline is March 31: ఏపీ రేషన్‌కార్డుదారులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో రేషన్ బియ్యంకు సంబంధించిన ఇతర సామగ్రి పొందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని పౌరసరఫరాల కమిషన్ సూచించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న ప్రతి రేషన్ లబ్ధిదారుడు ఈనెల చివరిలోగా తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఒకవేళ ఈకేవైసీ చేయని యెడల రేషన్‌కు సంబంధించిన బియ్యంతోపాటు ఇతర సామగ్రిని పొందేందుకు ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే గ్రామ, వార్డు సచివాలయాల్లో మొబైల్ యాప్ లేదా రేషన్ దుకాణాల్లోని ఈ పాస్ పరికరాల ద్వారా రేషన్ లో వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా 5 ఏళ్లలోపు ఉన్న చిన్నారులు తప్పా మిగతా వివరాలను అప్డేట్ చేసుకునేందుకు ఈనెల 31 వరకు గడువు ఉందని, ఈ గడువులోగా ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పింది.
ఇదిలా ఉండగా, రాష్ట్రం నుంచి ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు బతుకుదెరువు కోసం వెళ్లిన వాళ్లు సైతం ఎక్కడైనా ఈకేవైసీ చేసుకునే అవకాశం కల్పించారు. సమీపంలో ఉన్న రేషన్ షాపుల్లో లేదా మీ సేవ, ఆధార్ కేంద్రాల్లోనూ ఈకేవైసీ నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన పెంచాలని, సొంత గ్రామాలకు రావాల్సిన అవసరం లేదని సూచించింది.