Site icon Prime9

AP Assembly resolution: దళిత క్రిస్టియన్లను ఎస్సీలు, బోయలను ఎస్టీల్లో చేర్చాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం

AP Assembly

AP Assembly

AP Assembly resolution: ఏపీ అసెంబ్లీ శుక్రవారం రెండు కీలక తీర్మానాలు ఆమోదించింది. బోయ, వాల్మీకి కులస్థులను ఎస్టీల్లో చేర్చాలని ఒకతీర్మానం, దళిత క్రిష్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని మరో తీర్మానం చేసింది. అసెంబ్లీలో ఆమోదించిన 2 తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని సీఎం జగన్ అన్నారు. పాదయాత్రలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై దీని ప్రభావం ఉండదని సీఎం చెప్పారు.

ఎస్టీలను గుండెల్లో పెట్టుకుంటాను..(AP Assembly resolution)

పక్కనే ఉన్న కర్ణాటకలోని బళ్లారిలో తమకు ఎస్టీ హోదా ఉందని రాయలసీమలో లేదని బోయ, వాల్మీకి కులస్దులు ఎన్నో ఏళ్లుగా చెబుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేకపోయినప్పటికీ వారికి ఉపశమనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని చెప్పాము. బోయ, వాల్మీకి కులస్దుల స్దితిగతులపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్ ను నియమించడం జరిగింది. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వీరు ఎక్కువగా ఉన్నారు. వీరి పరిస్దితులను అధ్యయనం చేసిన తరువాత వీరిని ఎస్టీల్లో చేర్చాలని నిర్ణయించాము. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నామని సీఎం జగన్ చెప్పారు. ఎస్టీలు నన్ను ఎలా గుండెల్లో పెట్టుకున్నారో తాను కూడా వారిని అలాగే పెట్టుకుంటానని అన్నారు.

దళితుడు మతం మారినా పరిస్దితి మారదు..

దళితుడు తాను ఆచరిస్తున్న మతాన్ని వీడి వేరే మతంలో చేరినంత మాత్రాన అతని సామాజిక, ఆర్దిక జీవన స్దితిగతుల్లో ఎటువంటి మార్పు ఉండదు. మతం అనేది నాలుగు గోడల మధ్య దేవుడికి, అతనికి ఉన్న సంబంధం. కేవలం మతం మార్పిడి వలన వీరికి రావలసిన ఎస్సీ హక్కులు రాకపోవడం అన్యాయం. అందువలన వీరిని ఎస్సీల్లో చేర్చాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు కూడా ఈ తీర్మానం చేసారని అన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుందని దీనితో ఆంధ్రప్రదేశ్ ఇంప్లీడ్ అయిందని చెప్పారు.

Exit mobile version