Site icon Prime9

Ycp Mla Balineni : ఒంగోలు పోలీసుల తీరుపై ఫైర్ అయిన వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.. గన్‌మెన్‌లను సరెండర్‌ !

Ycp Mla Balineni fires on ongole police department about fake documents issue

Ycp Mla Balineni fires on ongole police department about fake documents issue

Ycp Mla Balineni : మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.. ఒంగోలు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమం లోనే నిరసన వ్యక్తం చేస్తూ తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేశారు. అలానే ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి బాలినేని లేఖ రాశారు. ఒంగోలులో ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో పోలీసుల వ్యవహారశైలిపై అసంతృప్తితో బాలినేని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఎవరు ఉన్నా కూడా వదిలిపెట్టవద్దని ఇప్పటికే పలుమార్లు అధికారులను కోరిన బాలినేని.. అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో మూడు రోజుల క్రితం కలెక్టర్‌ సమక్షంలో ఎస్పీని కూడా కోరారు బాలినేని. పోలీసులు తన సూచనలను పట్టించుకోక పోవటంతో గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు డీజీపీకి రాసిన లేఖలో వివరించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని.. నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ కి ఆప్తులు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ రకంగా వ్యవహరించడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

అయితే, కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారు పోలీసులు.. ఒంగోలుకు చెందిన ప్రధాన నిందితుడు చితిరాల పూర్ణచంద్రరావు మరో ఇద్దరు అయినాబత్తిన యానాదిరావు, గొర్రెపాటి రవీంద్రబాబులతో కలిసి ఈ దందా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నకిలీ సర్టిపికెట్ల కోసం తమను సంప్రదిస్తే ఖాళీ స్టాంప్ పేపర్స్ ఇవ్వడంతో పాటు పాత తేదీలతో వీలునామాలు, దొంగ అగ్రిమెంట్లు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. గత 15 ఏళ్ళ నుంచి నకిలీ పత్రాలు, అగ్రిమెంట్లు పాతడేట్లు వేసి అమ్ముతున్నట్టు గుర్తించారు. అలాగే పాత తేదీలతో జనన-మరణ సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నట్టు గుర్తించారు.

ఈ కేసులు విచారించేందుకు జిల్లా ఎస్‌పి మలికగార్గ్‌ ఆద్వర్యంలో ప్రత్యేక సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికి తొమ్మిది కేసులు నమోదు కాగా గత నెల 26న నలుగురు నిందితులను అరెస్ట్‌ చేయగా.. రీసెంట్ గానే మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొందరు అనుమానితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. సిట్‌ దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో నిందితులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులు సహకరించినట్టు తేలితే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఒంగోలు డిఎస్‌పి నారాయణస్వామిరెడ్డి తెలిపారు.

Exit mobile version