YCP Corporators to Join Janasena: ఒంగోలులో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఒంగోలు కార్పొరేషన్‌లో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతోపాటు ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరటానికి రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వీరంతా శనివారం నాటికి జనసేనాని సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి, జనసేనలో చేరిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనకు బలం పెరిగిన సంగతి తెలిసిందే.
ఒంగోలులో వైసీపీ ఖాళీ..
గతంలో జరిగిన ఒంగోలు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 41 మంది వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందటంతో ఆ పార్టీకి మేయర్ స్థానం దక్కింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత 19 మంది కార్పొరేటర్లు, మేయర్ కలిసి.. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో మిగిలిన కార్పొరేటర్లు.. బాలినేని శ్రీనివాసరెడ్డి టచ్‌లోకి వెళ్లిపోయారు. తదుపరి పరిణామాల్లో ఆయన జనసేనలో చేరటంతో వారంతా ఆయన బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలతో ఒంగోలు వైసీపీ ఖాళీ కాబోతోందనే వార్తలు అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తర్వాతి స్టెప్ అదేనా?
ఉమ్మడి ప్రకాశం జిల్లా మీద పట్టుసాధించే క్రమంలో మాజీ మంత్రి బాలినేని.. జడ్పీ పీఠం మీదా కన్నేసినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను, ఎంపీపీలను, సర్పంచ్‌లతో మాట్లాడి వారిని జనసేనలో చేర్పించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో కొంత సఫలమైనా, కూటమిలోని మరో పార్టీ అయిన టీడీపీ సాయంతో జిల్లా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవచ్చని, తద్వారా జిల్లాలో రాజకీయంగా జనసేనకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని బాలినేని భావిస్తున్నట్లు సమాచారం.