Site icon Prime9

Undavalli Arun Kumar: వైఎస్ ఉన్నపుడే పోలవరం అనుమతులు.. ఉండవల్లి అరుణ్ కుమార్

Undavalli-Arun-Kumar

Hyderabad: వైఎస్ చనిపోవడానికి 12 రోజుల ముందే పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనుమతులన్నీ వచ్చాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. గోదావరి నీటితో కోస్తాంధ్రని, కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేయాలని వైఎస్ కలలుగన్నారని అన్నారు. ‘‘జలయజ్ఞం పోలవరం- ఓ సాహసి ప్రయాణం ’’ పేరిట మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రచించిన పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలు అవుతుండటాన్ని చూసి వైఎస్ ఆవేదన వ్యక్తం చేసేవారని అరుణ్ కుమార్ తెలిపారు.

కాఫర్ డ్యాం కట్టకుండా, డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని, ఈ తప్పు చంద్రబాబుదేనని అంబటి రాంబాబు అంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఏది ముందు కట్టాలనే దానిపై సమాధానం చెప్పాల్సింది ఇంజనీర్లేనని, చంద్రబాబు, జగన్ ఏం చేస్తారని అరుణ్ కుమార్ ప్రశ్నించారు. రూ.2000 కోట్ల ప్రజా ధనం వృథా అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ భారీ వరదలు చోటు చేసుకుంటే, మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోతుందని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనలో ఏపీకి కాస్త న్యాయం జరిగింది పోలవరంతోనే అని ఆయన అన్నారు.

కేంద్రమాజీ మంత్రి జైరామ్ రమేష్ వర్చువల్ విధానంలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజన్ ఉన్న నేత అని కొనియాడారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించిందన్నారు. వైఎస్ సాగునీటి పారుదలకు మాత్రమే కాకుండా సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఈ పుస్తకాన్ని మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు.

Exit mobile version