Guntur Stampede Issue : గుంటూరు జరిగిన తొక్కిసలాట ఘటన గురించి అందరికీ తెలిసిందే. వికాస్ నగర్ లో ఉయ్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషాద ఘటనలో అరెస్ట్ అయిన ఉయ్యూర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ కు తాజాగా ఊరట లభించింది. ఈ ఘటనకు, ఆయనకు సంబంధం లేదని తేలుస్తూ శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో… శ్రీనివాస్ కు 304 (2) నుంచి మినహాయింపు లభించింది. దీంతో రూ.25 వేల స్వయం పూచీకత్తుపై ఆయనను విడుదల చేశారు.
అదే విధంగా పోలీసుల విచారణకు శ్రీనివాస్ సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా గుంటూరు తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడుగా శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా… పలువురు గాయపడ్డారు. కానుకలు తీసుకునేందుకు మహిళలు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. మృతులను గోపిశెట్టి రమాదేవి, రాజ్యలక్ష్మి, సయ్యద్ ఆసిమాగా గుర్తించారు.
కాగా మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ఉయ్యూర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ ప్రకటించారు. ఈ ఘటనకు ఉయ్యూర్ ఫౌండేషన్‌దే పూర్తి బాధ్యతని… ఘటనపై ప్రభుత్వం రాజకీయం చేయవద్దని శ్రీనివాస్ కోరారు. సంఘటన దురదృష్టకరమని… జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. మున్ముందు చేసే కార్యాక్రమాల్లో ఎటువంటి లోపాలు లేకుండా చేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తానని, ఆయా కుటుంబాలకు అండగా ఉంటాను అని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తెదేపా పార్టీకి, చంద్రబాబుకు ఎన్ఆర్ఐలు అండగా ఉంటామన్నారు. పేదలకు మధ్యలో నిలిపి వేసిన కానుకలను వారి ఇంటికే పంపిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజా స్పందించారు. జరిగిన ఘటన దురదృష్టకరమని… పోలీసుల సూచనతోనే కార్యక్రమం జరిగిందని వివరించారు. సేవ చేయాలనే తపనతోనో శ్రీనివాస్ ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేశారని అన్నారు. అతనిపై వైకాపా ప్రభుత్వం దుర్మార్గంగా కేసు పెట్టిందని ఆరోపించారు. అతనిని విడుదల చేయడం వల్ల న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.