Nirmala Sitharaman: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ నుంచి ఇండియాకు సైతం సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ సంయుక్త సెషన్‌లో మాట్లాడారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ సెషన్‌లో మాట్లాడటం ఇదే మొదటి సారి. ఇండియా, చైనా, కెనడా దేశాలపై సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు.
ఇండియా, చైనాతోపాటు పలు దేశాలపై వచ్చేనెల 2 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా అగ్రరాజ్యం అమెరికాపై కొన్ని దేశాలు పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, ఇండియా వంటి దేశాలు తమ నుంచి అధికంగా సుంకాలు వసూలు చేస్తున్నాయని, ఇది చాలా అన్యాయమని ట్రంప్ చెప్పారు. ఇండియా అమెరికాపై 100శాతం కంటే ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోంది. తాజాగా ట్రంప్ ప్రకటనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.
చర్చలకు అమెరికా వెళ్లిన కేంద్ర మంత్రి గోయల్..
అమెరికా విధిస్తున్న సుంకాల విషయమై చర్చలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్లారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అమెరికా వాణిజ్య మంత్రులతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఇండియా ఎగుమతుల విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చర్చలు ఉంటాయని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. దేశంలో ఉన్న వ్యాపారవేత్తలు, చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్లు, వ్యాపార సంఘాల సలహాలు, సూచనలు తీసుకొని బడ్జెట్‌లో మార్పులు చేస్తామన్నారు. ఆర్థికవేత్తలు, వివిధ వర్గాల మేధావులతో కేంద్ర బడ్జెట్‌పై విశాఖపట్నంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మీడియాతో మాట్లాడారు.
సూచనలు వస్తే సవరణలు చేసి బడ్జెట్‌ను ఆమోదిస్తాం..
ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ టేబుల్ చేశాక మధ్యలో గడువు ఉంటుందని ఆమె తెలిపారు. మళ్లీ పార్లమెంట్ మొదలైన తర్వాత ఫైనాన్స్ బిల్లుపై చర్చ జరుగుతుందన్నారు. తర్వాత ఆమోదం ఉంటుందని చెప్పారు. చాలా ముఖ్యమైన అభిప్రాయాలు, సూచనలు వస్తే సవరణలు చేసి బడ్జెట్‌ను ఆమోదిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఖర్చులతో రోడ్లు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. జల్‌జీవన్ మిషన్ పథకం ద్వారా ఒక్కో ఇంటికి తాగునీరు అందిస్తున్నామన్నారు. మనం ఉపయోగించుకున్న వాటికే పన్ను చెల్లిస్తామని, కారు కొంటే దానిపై పన్ను చెల్లిస్తామని, కారు కొనని వారు చెల్లించన్నారు. రోడ్డు వినియోగించుకున్న వారే టోల్ ట్యాక్స్ చెల్లిస్తారని, ప్రజలు పన్నులు చెల్లిస్తేనే రహదారులు నిర్మించగలిగేదని ఆర్థిక మంత్రి వివరించారు.