Site icon Prime9

Tirumala: తిరుమలలో దంచికొట్టిన వర్షం..క్యూలైన్ల లోని నీరు

Tirumala

Tirumala

Tirumala: ఆంధ్రప్రదేశ్ లో పది రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. కాలు బయటపెట్టాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవ్వగా.. గురువారం వరుణుడు పలకరించాడు. తిరుమల కొండపై భారీ వర్షం పడింది. అప్పటి వరకు విపరీతమైన ఉక్కపోతతో తల్లడిల్లిన భక్తులు వర్షం పడటంతో ఊపిరిపీల్చుకున్నారు.

కొండ పై అరగంట పాటు వర్షం దంచి కొట్టింది. దీంతో క్యూ లైన్ల లోకి వర్షపు నీరు చేరింది. ఆలయం చుట్టూ పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇన్ని రోజులు ఉష్ణోగ్రతలకు అల్లాడిపోయిన జనాలు.. ఒక్కసారిగా పడిన వర్షంతో రిలాక్స్ అయ్యారు. గత రెండు వారాలుగా తిరుమల కొండపై ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో ఉన్నాయి. 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా పడిన వర్షానికి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

 

 

కొనసాగుతున్న భక్తుల రద్దీ(Tirumala)

మరో వైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం కిలోమీటర్ల కొద్ది క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణ గిరి షెడ్లు కిక్కిరిపోయాయి. శిలాతోరణం వరకు రెండు కిలో మీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు.

దర్శనానికి దాదాపు 36 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచి నీరు, అన్నప్రసాదాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

 

Exit mobile version