Tirumala: తిరుమల ఆనంద నిలయం దృశ్యాలను తన మొబైల్ లో చిత్రికరించడం తాజాగా సంచలనం సృష్టిస్తోంది. ఓ భక్తుడు ఆలయం ఆవరణలోకి సెల్ ఫోన్ తో ప్రవేశించాడు. ఆనంద నిలయం దృశ్యాలను తన మొబైల్ లో వీడియో తీశాడు. తర్వాత ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే తిరుమలలో అత్యంత కఠినంగా తనిఖీలు నిర్వహిస్తారు. దాదాపు మూడు ప్రాంతాల్లో ఈ తనిఖీలు ఉంటాయి. అంతటి నిఘాలో సదరు భక్తుడు సెల్ ఫోన్ తీసుకురావడంపై తిరుమల మరోసారి భద్రతా వైపల్యం బయటపడింది. దీంతో టీటీడీపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి స్పందించారు. సీసీ కెమెరాలను పరిశీలించి అసలు విషయం తెలుసుకుంటామన్నారు.
కాగా, తిరుమల ఆనంద నిలయం దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ వెల్లడించారు. టీటీడీ నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడం, వీడియో చిత్రీకరించడం చట్టరీత్యా నేరం అనే విషయం భక్తులందరికీ తెలుసనన్నారు. ‘ఆదివారం రాత్రి తిరుమలలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో దాదాపు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
అదే సమయంలో సదరు భక్తుడు పెన్ కెమెరాతో లోపలికి తీసుకెళ్లి వీడియో చిత్రీకరించినట్లు అనుమానిస్తున్నాం. శ్రీవారి ఆలయంలో పాటించాల్సిన నిబంధనల గురించి భక్తులందరికీ తెలుసు. అయినా ఇలా జరగడం బాధాకరం. సీసీటీవీల ద్వారా భక్తుడిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాం. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం’ ఆయన తెలిపారు.