Site icon Prime9

Botsa Satyanarayana : విశాఖలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. రంగంలోకి బొత్స

Botsa Satyanarayana

Botsa Satyanarayana: విశాఖలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా జీవీఎంసీ మేయర్ పీఠం కోసం కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ, జనసేన పార్టీలు కలిసికట్టుగా మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి వైసీపీకి చెక్ పెట్టేందుకు ప్లాన్ వేస్తున్నాయి. ప్లాన్‌ను తిప్పికొట్టేందుకు వైసీపీ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

 

 

టీడీపీ, జనసేన మేయర్‌ను పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు చేయగా, అధిష్ఠానం బొత్సను రంగంలోకి దింపింది. ఈ సందర్భంగా బొత్స వైసీపీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. టీడీపీ వలసలకు అడ్డుకట్ట వేయడానికి, మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గకుండా పక్కా వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఇటీవల వైసీపీని వీడిన కార్పొరేటర్లను తిరిగి ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మేయర్‌పై అవిశ్వాస పరీక్ష రోజుకు ముందుగా వైసీపీ కార్పొరేటర్లను ప్రత్యేక క్యాంపులకు తరలించే ప్రణాళికలు రచిస్తున్నారు. మేయర్‌ సీటును కాపాడేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేయాలని పార్టీ నిర్ణయించుకుంది.

 

 

ఇదివరకే విశాఖలో బలం పెంచుకోవాలని టీడీపీ, జనసేన సమన్వయంగా పనిచేస్తూ వైసీపీ కార్పొరేటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తాము సరిపడా సంఖ్యలో కార్పొరేటర్ల మద్దతును సంపాదించామని చెబుతున్నారు. ఇందులో భాగంగా వైసీపీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. ఉత్కంఠ భరితమైన రాజకీయ పోరులో మేయర్ పదవి ఎవరి చేతికి వెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ మేయర్‌ను కాపాడుకుంటుందా? లేక టీడీపీ-జనసేన కూటమి పీఠాన్ని దక్కించుకుంటుందా? అనేది త్వరలో తేలనుంది. ప్రస్తుతం రాజకీయ వలసలు, వ్యూహాత్మక సంచలనాలు విశాఖలో హాట్ టాపిక్‌గా మారాయి.

Exit mobile version
Skip to toolbar