Sri Lakshmi Maha Yagnam : ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అతిపెద్ద కార్యక్రమం చేపట్టడానికి శ్రీకారం చుట్టింది. “మహాయజ్ఞం” పేరిట ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయనున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఈ మహా యజ్ఞం నిర్వహిస్తున్నామని ఏపీ సర్కారు వివరించింది. మొదటి రోజు, చివరి రోజు జరిగే రాజశ్యామల యాగంలో ఏపీ సీఎం జగన్ పాల్గొననున్నారు. కాగా ఈ ఆరు రోజుల పాటు చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత, శ్రీలక్ష్మీ మహాయజ్ఞం చేయనున్నారు.
మహా యజ్ఞానికి సంకల్పం చెప్పేందుకు జగన్ ఇవాళ విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియానికి వస్తున్నారు. ఈ మేరకు ఉదయం 8.30 కు యజ్ఞ క్రతువును సీఎం జగన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా 108 కుండాలతో, 4 ఆగమనాలతో, 500 మంది రుత్విక్కులతో మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో దేవాదాయశాఖ ఈ యాగాన్ని నిర్వహిస్తోంది.
మహాయజ్ఞం ముఖ్యాంశాలు (Sri Lakshmi Maha Yagnam)..
అయితే ఇవాళ్టి నుండి ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు యజ్ఞం జరగనుంది.
సాయంత్రం ఆరు గంటల నుండి స్తోత్రపారాయణాలు, ప్రవచనాలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి.
వీటితో పాటు ప్రధాన ఆలయాలకు చెందిన దేవతామూర్తుల కల్యాణ ఉత్సవాలు నిర్వహించనున్నారు.
పూర్ణాహుతితో మహాయజ్ఞం ముగియనుంది.
ఆరు రోజుల పాటు జరిగే రాజశ్యామల యాగానికి ఒక్కో రోజు ఒక్కో పీఠాధిపతిని ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.
మొత్తం 450 మంది రుత్వికులు ఈ యాగంలో పాల్గొంటారని కొట్టు సత్యనారాయణ చెప్పారు.
రాజశ్యామల యాగానికి వచ్చే వారికి రెండు పూటలా ప్రసాదంతో పాటు నీరు, మజ్జిగ అందజేస్తామని వెల్లడించారు.
ఎండాకాలంలో జరుగుతున్న ఈ యాగానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.