Road Accident : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద అతివేగంతో దూసుకొచ్చిన లారీ.. వెనుక నుంచి స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారులు బేతనీ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు. చిన్నారులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఉదయం రైల్వే స్టేషన్ నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఆటోను వెనుకగా వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొంది. దీంతో ఆటో ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రహదారిపై రక్తపు మడుగులో పడి ఉన్న విద్యార్థులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టిన లారీ సుమారు 100 మీటర్ల దూరం వెళ్లి ఆగింది.
లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. రెడ్ సిగ్నల్ పడినప్పటికీ హైస్పీడ్‌లో వచ్చి వెనుక నుంచి లారీ ఆటోను డీకొట్టింది. హెవీ వెహికల్స్‌కి నిషేధం ఉన్న సమయంలో లారీ సిటీలోకి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరో ఘటనలో మధురవాడ-నగరం పాలెం రోడ్డులో ఆటో బోల్తా పడి విద్యార్థులకు గాయాలయ్యాయి. మధురవాడ నుంచి నగరంపాలెం వైపు వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో ఎనిమిది మంది విద్యార్థులు ఉండగా.. వారందరూ స్వల్పంగా గాయపడ్డారు.