Sullurpeta: తమిళనాడు రాష్ట్రానికి చెందిన విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ సిబ్బంది వినూత్నంగా నిరసనలు చేపట్టారు. తమ సమస్యల పై ఆ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రాలో తమ నిరసనలు గుప్పించి తమిళనాడు ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశారు.
వివరాల్లోకి వెళ్లితే, గడిచిన 10 సంవత్సరాలుగా తమిళనాడు విద్యుత్ శాఖలో 36 జిల్లాలకు చెందిన కాంట్రాక్ట్ కూలీలుగా పనిచేస్తున్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం ఎలాంటి రాయితీలు, నష్ట పరిహారాలు ఇవ్వడం లేదు. దీంతో పలు దఫాలుగా తమిళ అధికారులు, ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేసినప్పటికి ఫలితం శూన్యంగానే ఉండిపోయింది. దీంతో విసిగిపోయిన కార్మికులు కొత్త పంధాలో తమ నిరసనలు తెలియచేశారు. 200కు పైగా కార్మికులు ఆంధ్రా సరిహద్దు సూళ్లూరుపేట వద్దకు చేరుకొని స్థానిక చెంగాళమ్మ ఆలయ ఆవరణలో తమ నిరసనలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు విచిత్ర ధోరణితో సమస్య పై తమిళ ప్రభుత్వం దృష్టి పెట్టేలా వ్యవహరించారు. తమకు ఆంధ్రాలో బతకడానికి ఏపీ సిఎం జగన్ ఆదుకోవాలని నినాదాలు చేశారు. కుదరకపోతే తమిళనాడు సీఎం స్టాలిన్ తో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. నిరసనల కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వారంతా సీఎం జగన్ ను కలిసేందుకు విజయవాడకు బయల్దేరారు.
ఏపీ సీఎం ప్రధాని మోదీకి అనుకూలురని తమిళనాడులో ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో తమిళ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించేందుకు భాజపా చేస్తున్న ప్రయత్నాలకు అక్కడి సీఎం స్టాలిన్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొన్న విద్యుత్ కాంట్రాక్ట్ సిబ్బంది తమ సమసల్యను పరిష్కరించుకొనేందుకు ఓ చక్కని ఎత్తు వేశారని తెలుస్తుంది. ఎందుకంటే వారు ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆలయంలో నిరసనలు గుప్పించడం గమనార్హం.
ఇది కూడా చదవండి: Nallari Kishore Kumar Reddy: కాలయాపనకే మూడు రాజధానులు.. తిరుపతిని రాజధాని చెయ్యాలనిపించలేదా?