Police Notice To YCP Ex MP Gorantla Madhav: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, విచారణకు రావాలంటూ అనంతపురం మాజీ ఎంపీ, వైసీసీ నేత గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూడు నెలల క్రితం సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలతోపాటు మీడియా సమావేశంలో అత్యాచార బాధితురాలి పేరు వెల్లడించారని గతేడాది నవంబర్ 2న వాసిరెడ్డి పద్మ విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మాధవ్‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం సాయంత్రం అనంతపురంలోని గోరంట్ల మాధవ్ నివాసానికి వెళ్లిన విజయవాడ పోలీసులు మార్చి 5న విచారణకు రావాలని సెక్షన్ 35(3) కింద నోటీసులు అందజేశారు. విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.
స్పందించిన మాధవ్..
విజయవాడ పోలీసులు జారీ చేసిన నోటీసులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తాను వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. అయినా నేరం చేసిన వారిని వదిలిపెట్టి ప్రతిపక్షాలను అరెస్టు చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చూడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో అతి త్వరలో మీ చేష్టలు, అక్రమ కేసులకు అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలోని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మైండ్‌లో పెట్టుకోవాలని సూచించారు. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. విజయవాడ పోలీసులు ఇచ్చిన నోటీసులు తీసుకున్నానన్నారు. మార్చి 5 తేదీన హాజరు కావాలని చెప్పారని, న్యాయవాదుల సలహా తీసుకొని పోలీసుల విచారణకు వెళ్తాన్నారు. ప్రింట్ మీడియాలో సోషల్ మీడియలో వచ్చిన పేర్లను మాత్రమే తాను ప్రస్తావించాన్నారు. దీనిపై కేసు నమోదు చేసి అసలు ముద్దాయిలను వదిలిపట్టారని గోరంట్ల మండిపడ్డారు.
గతేడాది నవంబర్‌లో..
గతేడాది నవంబర్‌లో అత్యచార బాధితుల పట్ల వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. రేప్ బాధితుల వివరాలు.. గోరంట్ల మాధవ్ బహిర్గతం చేయడంపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబుకు ఆమె ఫిర్యాదు చేశారు. బాధితుల పట్ల దుర్మార్గంగా మాట్లాడిన గోరంట్ల మాధవ్ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ ఆమె విజయవాడ సీపీని కోరారు. గోరంట్లా మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ఓ మీడియా చానెల్ పేరును సైతం ఆమె తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చేందుకు విజయవాడ పోలీసులు గురవారం ఆయన నివాసానికి వెళ్లారు.