Site icon Prime9

Poornananda Swamy : పూర్ణానంద స్వామీజీ పై పోక్సో కేసు నమోదు.. చిత్ర హింసలు పెడుతూ రెండేళ్లుగా అత్యాచారం..

pocso case files on poornananda swamy in vijayawada and arrested

pocso case files on poornananda swamy in vijayawada and arrested

Poornananda Swamy : బాలికలు, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు అంతం లేకుండా పోతుంది. వయస్సుతో కూడా సంబంధం లేకుండా వారిపై దాడులు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రస్తుతం ఎవర్ని నమ్మాలో కూడా తెలియని అగమ్యగోచరమైన పరిస్థితుల్లోకి బాలికలు, యువతులు, మహిళలు వెళ్తున్నారని అనడంలో సందేహం లేదు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి.. మిత్రులు. తోటి ఉద్యోగులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర కూడా రక్షణ లేకుండా పోతుంది. ఇక ఈ బాబాలు, మత గురువులు, పాస్టర్లు ఇలా వీరిలో కొంతమంది మతం ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా ఏపీలో వెలుగుచూసింది.

అత్యాచారం ఆరోపణలపై విశాఖపట్టణం లోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ అరెస్ట్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. స్వామీజీ తనపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నారని ఓ బాలిక (15 ) ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు లేని ఆ అనాధ బాలిక ఫిర్యాదుతో గత అర్ధరాత్రి స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో బాలికను చేరదీసిన బంధువులు ఐదో తరగతి వరకు చదివించారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం విశాఖపట్టణంలోని కొత్త వెంకోజీపాలెంలో ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ స్వామీజీ ఆమెతో ఆవులకు మేత వేయించడం, పేడ తీయించడం వంటి పనులు చేయించేవారని.. రాత్రుళ్లు తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవారని బాలిక వాపోయింది.

ఏడాదిగా తన గదిలోనే గొలుసులతో బంధించారని.. ఎదురు తిరిగితే కొట్టేవారని.. రెండు చెంచాల అన్నాన్ని మాత్రమే పెట్టేవారని.. కాలకృత్యాలకు అనుమతించకపోయేవారని, వారానికి ఒకసారి మాత్రమే స్నానానికి వెళ్లనిచ్చేవారని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక చివరికి ఈ నెల 13న పనిమనిషి సాయంతో బాలిక ఆశ్రమం నుంచి బయటపడి.. రైల్వే స్టేషన్‌కు చేరుకుని తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఆ తర్వాత అక్కడ తనకు పరిచయమైన ప్రయాణికురాలికి తన బాధను చెప్పుకుంది.

ఆ మహిళ బాలికను తనతో పాటు తీసుకెళ్లి రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ హాస్టల్‌లో చేర్పించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల నుంచి లేఖ తీసుకొస్తేనే జాయిన్ చేసుకుంటామని చెప్పడంతో కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసి  అనుమతి లేఖను తీసుకున్నారు. బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ)కి కూడా జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. విజయవాడ దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్వామీజీపై పోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలిక ఫిర్యాదుపై స్వామీజీని గత అర్ధరాత్రి విశాఖలో అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version