Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో చిట్ ఫండ్ కంపెనీల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు జరుగుతున్న సంస్థల్లో మార్గదర్శి, శ్రీరామ్, కపిల్ చిట్స్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన లావాదేవీలను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అవకతవకలు జరిగితే కేసులు పెట్టే అవకాశం ఉంది.
వ్యక్తిగతంగా చిట్స్ వ్యాపారం చేసే వారు తరచూ ఐపీ పెడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలా అనధికారికంగా చిట్స్ వేయడం చట్టబద్ధం కాకపోయినప్పటికీ, ఏమీ చేయలేకపోతున్నారు. నిర్వాహకులు ఐపీ పెట్టినప్పుడు వాటిలో పెట్టుబడి పెట్టినవారి ప్రయోజనాలను కాపాడలేకపోతున్నారు. కంపెనీల విషయానికి వస్తే మార్గదర్శి, శ్రీరామ్ చిట్స్, కపిల్ చిట్స్ లాంటి కొన్ని సంస్థలు మంచి వ్యాపారం చేస్తున్నాయి.
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ రిజర్వు బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణల పై గతంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో రామోజీ రావు పై ఉన్న నేరాభియోగాలను కొట్టి వేస్తూ 2018 డిసెంబరు 31న ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిని సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఏపీ ప్రభుత్వం తాము కూడా ఇంప్లీడ్ అవుతామని పిటిషన్ దాఖలు చేసింది.