Site icon Prime9

AndhraPradesh: వినాయక మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుం చెల్లించక్కరలేదు..

Endowments Commissioner M Hari Jawaharlal

Endowments Commissioner M Hari Jawaharlal

AndhraPradesh: ఏపీలో గణేష్ మండపాల ఏర్పాటు నిబంధనలపై వివాదం సద్దుమణిగింది. గణేష్ ఉత్సవ్ కమిటీలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఓ జాబితా విడుదల చేసింది. వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం రుసుముల భారం మోపిందని వస్తున్న విమర్శలపై దేవాదాయశాఖ స్పందించింది. వినాయక మండపాలకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని దేవాదాయశాఖ కమిషనర్‌ జవహర్‌ లాల్‌ స్పష్టం చేశారు. రుసుం వసూలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటుకు స్థానిక పోలీస్‌, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఎవరైనా రుసుం చెల్లించాలని అడిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియోలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.

ఏపీలో వినాయ‌క చ‌వితి వేడుకలకు నిబంధనలకు సంబంధించి డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి స్పందించారు. చ‌వితి వేడుక‌ల‌పై ప్రత్యేక ఆంక్షలు ఏమిలేవన్నారు. భ‌ద్రత దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామ‌న్నారు. ఇందులో భాగంగా వినాయ‌క మండ‌పాలు ఏర్పాటు చేసుకునే వారు సంబంధిత పోలీస్ స్టేష‌న్ లో సమాచారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా నిబంధ‌న‌లకు అనుగుణంగా మండ‌పాలు ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు మాత్రమే స్పీక‌ర్లకు అనుమ‌తి ఉంటుంద‌ని డీజీపీ స్పష్టం చేశారు.

వినాయక మండపాలపై ఏర్పాటుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయవాడ వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమీక్ష సమావేశ నిర్వహించారు. వినాయక మండపాలకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదన్నారు. వినాయక చవితి వేడుకలకు ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. రుసుముల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి కొత్త నిబంధనలు తీసుకురాలేదన్నారు.
గత ప్రభుత్వంలో గుడులు కూల్చినప్పుడు హిందుత్వానికి విఘాతం కలిగింద‌న్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిబంధనలు తీసుకురాకపోయినా ..ప్రభుత్వం పండుగలు జరుపుకోకుండా ఇబ్బందులు పెడుతోందని, ఆంక్షలు విధిస్తుందంటూ పదేపదే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు.

Exit mobile version