Site icon Prime9

Nara Chandrababu Naidu : అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించిన నారా భువనేశ్వరి.. బాబుతో ములాఖత్ ఎప్పుడంటే ?

nara chandrababu naidu family members going to meet at jail

nara chandrababu naidu family members going to meet at jail

Nara Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ స్కామ్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి.. బాబు సతీమణి భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు అంతా రాజమండ్రిలోనే ఉంటున్నారు. కాగా ఈ క్రమంలోనే నారా భువనేశ్వరి ఈరోజు అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరం ఆలయానికి వెళ్లిన భువనేశ్వరి.. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భువనేశ్వరికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. ఇక భువనేశ్వరి, బ్రాహ్మణిలు అన్నవరంకు వచ్చిన నేపథ్యంలో అక్కడకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా జగ్గంపేటలో జరుగుతున్న దీక్షా శిబిరానికి భువనేశ్వరి వెళ్లనున్నారు. మరోవైపు బ్రాహ్మణి మాత్రం రాజమండ్రి క్యాంప్ సైట్‌లోనే ఉంటారని సమాచారం అందుతుంది.

నేడు చంద్రబాబుతో ములాఖత్..

రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈరోజు ములాఖత్ కానున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు వీరు చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యేందుకు జైలు అధికారులు అనుమతించినట్టుగా టీడీపీ అధిష్టానం వెల్లడించింది. చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్‌ పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పిటీషన్ మంగళవారం ప్రస్తావనకు రానున్నట్లు తెలిపింది. క్వాష్ పిటిషన్‌పై రేపు ప్రస్తావించడానికి సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం అనుమతిచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన అరెస్టు చెల్లదంటూ, సీఐడీ ఎఫ్ఐఆర్‌ను రద్దుకు చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  ఈ నెల 28నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకూ సుప్రీంకోర్టుకి సెలవులున్నాయి. విచారణ వాయిదా పడినా లేదా ఆలస్యం అయినా చంద్రబాబు కేసు అక్టోబర్ 3 తరువాతే తేలే అవకాశాలుంటాయని తెలుస్తుంది.

Exit mobile version