Site icon Prime9

AP Legislative Council : ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన నాగబాబు, సోము వీర్రాజు

AP Legislative Council

AP Legislative Council

AP Legislative Council : ఏపీ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన జనసేన పార్టీ నేత నాగబాబు సతీసమేతంగా మండలి చైర్మన్ కార్యాలయానికి వచ్చారు. బీజేపీ నేత సోము వీర్రాజు కూడా ఆఫీస్‌కు వచ్చారు. ఇద్దరు నేతలు మండలి చైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో ఎమ్మెల్సీలుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికి, గజమాలతో సన్మానించారు. బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి, ఇతర నాయకులు శాలువాతో సోము వీర్రాజును సత్కరించారు.

 

 

ఏపీలో బీజేపీకి మంచి రోజులు..
ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి మాట్లాడుతూ.. సోము వీర్రాజు రెండోసారి ఎమ్మెల్సీ కావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇది‌ బీజేపీలో ఒక చారిత్రక విజయంగా పేర్కొన్నారు. రెండోసారి ఎమ్మెల్సీగా సోము వీర్రాజుకు అవకాశం వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ సీటు బీజేపీకి కేటాయించారని తెలిపారు. ఏపీలో పార్టీ పటిష్టతకు కృషి చేసిన సోము వీర్రాజు సేవలను అధిష్ఠానం గుర్తించిందని చెప్పారు. అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలు ఎక్కువుగా ఉన్నా మండలిలో వైసీపీ సభ్యులే ఎక్కువగా ఉన్నారన్నారు.

 

 

వైసీపీ వైఫల్యాలు ఎండగట్టాలి..
పెద్దల సభలో అనేక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉందని, మండలిలో మన వాణినిని వినిపించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. కేంద్ర పెద్దలు సోము వీర్రాజు గళం విప్పుతారనే నమ్మకంతోనే ఆయనను ఎంపిక చేశారన్నారు. ఏపీలో బీజేపీకి మంచి రోజులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వంలో జరిగే మంచి కార్యక్రమాలు ప్రజలకు వివరించడంతోపాటు కిందస్థాయిలో జరిగే లోపాలను ప్రభుత్వం దృష్టికి బీజేపీ తీసుకెళ్తుందన్నారు. ప్రతి బూత్‌లో కమిటీలు వేసుకుని ఏపీలో అన్ని విధాలా పార్టీ బలంగా తయారవుతుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

Exit mobile version
Skip to toolbar