MLC Election Result 2023: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయ్యింది. ఉదయం 8 గంటలకు నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఏపీలో మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. 3 గ్రాడుయేట్, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగడం వల్ల లెక్కింపు విషయంలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా అధికారులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
స్థానిక సంస్థల ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటలోగా రావచ్చు. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు రేపు అర్ధరాత్రి వరకూ వచ్చే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ స్థానాల ఫలితాలు మాత్రం ఎల్లుండి సాయంత్రానికి విడుదల కానున్నట్టు సమాచారం.
ఏపీలో 9 ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదలైంది. ముందుగా చెల్లని ఓట్లను పక్కనపెట్టారు సిబ్బంది. ఆపై పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు.
అత్యధికంగా కర్నూలు గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 49 మంది బరిలో నిలబడ్డారు. విశాఖ గ్రాడ్యుయేట్ స్థానంలో 37 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఇక ప్రకాశం నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 22 మంది తలపడనున్నారు.
కడప, అనంతపురం, కర్నూలు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది పోటీలో ఉండగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది పోటీ పడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానిక సంస్థల స్థానాలకు బరిలో ఆరుగురు పోటీలో ఉన్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో ఒక టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల లెక్కింపు జరుగుతోంది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ సీటు కోసం పోలింగ్ జరిగిన విషయం విధితమే.
కాగా దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది.
ఎమ్మెల్సీ అభ్యర్థి పోటీలో చెన్నకేశవరెడ్డి, జనార్థన్‌రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, హర్షవర్థన్, మాణిక్ రెడ్డి ఉన్నారు. మరి వీరిలో విజయం ఎవరిని వరించనుందో ఈ రోజు సాయంత్రంలోపు తేలనుంది.