Mla Vasantha Krishna Prasad: ఒక వైపు ప్రతిపక్ష పార్టీలన్నీ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు అధికారంలోని వైకాపా మాత్రం మూడు రాజధానులను కొనసాగించలంటూ పట్టుబట్టింది. ఈ తరుణంలోనే కోర్టు కేసులు, వివాదాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతి రైతులు మహా పాదయాత్ర పేరుతో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తీవ్ర స్థాయిలో నిరసనలు చేస్తున్నారు. ఈ విషయం సుప్రీం కోర్టు వరకు వెళ్ళిన విషయం కూడా తెలిసిందే. అయితే రాజధాని విషయంలో అధికార వైసీపీ నేతలంతా మూడు రాజధానుల స్వరాన్ని ఎత్తుకుంటున్నారు. అయితే తాజాగా వైకాపా ఎమ్మెల్యే అమరావతి మాత్రమే రాజధాని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇటీవల కాలంలో వైసీపీ ఎక్కువ వివాదాలు ఎదుర్కొంటున్న నేతల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఒకరు. గతంలోనే రాజధాని అంశంపై వసంత కామెంట్స్ చేశారు. అప్పుడు కూడా ఆయన వ్యక్తిగతంగా అమరావతికే జై అన్నారు. దీనిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరగటంతో తరువాత ఆయన మరోసారి మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. జగన్ నిర్ణయం మేరకు నడుచుకుంటానని అన్నారు. ఇప్పుడు మరోసారి అమరావతి రాజధాని అని వసంత వెల్లడించారు.
వసంత తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కూడ కమ్మ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మైలవరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపుల్లో ఆ కామెంట్స్ సర్క్యూలేట్ అయ్యాయి. దీనిపై వసంత కూడా పదే పదే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన తండ్రి చేసిన వ్యాఖ్యలకు తనకు సంబందం లేదని వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.
రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన వసంత(Mla Vasantha Krishna Prasad)
గతంలో ఈనాటి రాజకీయ నాయకులు వేగంగా ముందుకు పరుగెత్తాలంటే.. వెనకటి పెద్దరికం పనికిరాదు. పక్కన 10 మంది పోరంబోకులు ఉండాలి. వాళ్లు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తేనే రాజకీయాల్లో ముందడగు వేసే పరిస్థితి ఉందని అన్నారు. ఇలాంటి పరిస్థితులను చూస్తే.. రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా, ఎమ్మెల్యే ఎందుకయ్యానా అని అనిపిస్తుంటుందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Mla Vasantha Krishna Prasad) ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా సాటి వ్యక్తులకు సాయం చేయలేకపోతున్నానని చెప్పారు. తాను ఎన్నికలప్పుడూ మాత్రమే రాజకీయం చేస్తానని అన్నారు. తర్వాత నన్ను గెలిపిచినవాళ్లకు ఏ విధంగా మంచి చేయాలని చూస్తానని చెప్పారు. గత మూడున్నరేళ్లలో తానెక్కడా అక్రమ కేసులు పెట్టించలేదని.. పథకాలు ఆపలేదని చెప్పారు. కేసుల విషయంలో కొంతమంది తమ పార్టీ నాయకులకు తనపై అసంతృప్తి ఉండొచ్చని అన్నారు.
అంతకు ముందు గుంటూరు తొక్కిసలాట ఘటనలో.. ఉయ్యూరు శ్రీనివాస్ నాకు మంచి మిత్రుడు,ప్రవాసాంధ్రుల వలన దేశానికి మంచి జరుగుతుంది. శ్రీనివాస్ పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి, ప్రజలకు నష్టం జరగాలని ఇలాంటి కార్యక్రమాన్ని చేయరు. టీడీపీ తో కలిసి కార్యక్రమం చేశారు కాబట్టి శ్రీనివాస్ పై ఇలా వివాదాలు ముసురుకుంటున్నాయి. సేవా కార్యక్రమాలు చేయడం మంచిపని. ఎన్నారైలను ఇబ్బందులు పెడితే సహాయం చేసేందుకు భవిష్యత్‌లో ఎవ్వరూ ముందుకు రారని ఘాటుగా వ్యాఖ్యానించారు.