Minister Ramanaidu says ap govt Aims To Generate 20 Lakh Jobs In Five Years: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీపై తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో డీఎస్సీ విడుదల చేసి, వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ఉపాధ్యాయ పోస్టుల నియమకాలు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
నిరుద్యోగులకు జగన్ మోసం..
పాలకొల్లులో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయాన్ని కోరుతూ ఆదివారం మంత్రి ప్రచారం నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోసం కృషిచేయాలని కోరారు. శాసనమండలిలో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఇవ్వాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అంటూ జగన్ నిరుద్యోగులను మోసం, దగా చేశారని విమర్శించారు.
మత్స్యకారులకు వరం..
వైసీసీ హయాంలో ఉపాధ్యాయులను మద్యం షాపుల దగ్గర విధులకు పెట్టారని ధ్వజమెత్తారు. సముద్రంలో చేపల వేట నిషేధిత రోజుల్లో ఏప్రిల్ మాసం నుంచి మత్స్యకారులకు జీవన మృతి నిమిత్తం రూ.20 వేలు అందజేస్తామని ప్రకటించారు. మే నెలలో రైతులకు రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. జూన్ నెల విద్యా సంవత్సరానికి ముందు నుంచే తల్లికి వందనం కార్యక్రమం అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
జగన్ అరాచక శక్తి ..
రాజధాని అమరావతి, పోలవరం వంటి ముఖ్య ప్రాజెక్టుల పునర్ని నిర్మాణం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల వంటివి కూటమి ప్రభుత్వం 8 నెలల పాలనలో జరిగాయని గుర్తుచేశారు. వల్లభనేని వంశీ అంటేనే అరాచకత్వం, అవినీతి, గుండాయిజం అలాంటి వ్యక్తిని సమర్థిస్తున్న జగన్ కూడా ఒక అరాచక శక్తి అని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటన లేదని, కానీ వల్లభనేని వంశీ జాతీయ రహదారి పక్కన ఉన్న టీడీపీ ఆఫీసును ఐదు గంటల పాటు తగులబెట్టారని మండిపడ్డారు. పార్టీ ఆఫీస్ దాడిపై ఫిర్యాదు చేసిన దళిత వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘనుడు వల్లభనేని అని ధ్వజమెత్తారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా జగన్ బుద్ధి ఇంకా మారలేదని మంత్రి నిమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.