Maha Shivaratri Brahmotsavam Begins in Srisailam: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం కలగలిసి ఉన్న మహా క్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రంలో ఓకే ప్రాంగణంలో శక్తిపీఠం, జ్యోతిర్లింగం రెండు కలగలసి ఉన్నాయి. ఈ ఆలయంలో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 1వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఈనెల 23వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు.. స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 25న కీలక ఘట్టం పాగాలంకరణ జరగనుంది. కాగా, శ్రీశైలం ఆలయం రంగురంగుల విద్యుద్దీకరణలు, పెయింటింగ్‌లతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల్ల కొండలను దాటుకొని శ్రీశైలం చేరుకుంటారు.
మరోవైపు, శ్రైశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు తాగునీరు, వసతి, వైద్యం, ప్రసాదం ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే స్వామి వారిని దర్శించుకునేందుకు 5 రోజుల ముందే భక్తులు పాదయాత్రతో శ్రీశైలం తరలివస్తారు. వీరి కోసం శ్రీశైలం క్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనే కైలాసద్వారం, భీమునికొలను, హటకేశ్వరం మెట్ల మార్గంలో భక్తులు సేద తీరేందుకు భారీ షెడ్లు టెంట్లు ఏర్పాట్లు చేశారు. పాదయాత్రతో వచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు మంచి నీటి ట్యాంకులను సిద్దం చేశారు. అలాగే మట్టిరోడ్లను మరమ్మతు చేసి రోడ్ల పొడవున చదును చేయించారు.