AP Weather Report : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. మండే ఎండాలకు తోడు తీవ్ర వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ కారణంగా ముగ్గురు మరణించారు. అధిక ఉష్ణోగ్రతల నమోదుతో పాటు, వడగాల్పులు తీవ్రత కూడా ఎక్కుగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 48డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్. అంబేద్కర్ తెలిపారు.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. తొమ్మిది మండలాల్లో తీవ్రవడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. సోమవారం 18 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 131 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో 46.2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజుకూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ మేరకు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు, తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉంటుందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రయాణాల్లో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.