AP Deputy CM Pawan Kalyan rural development: రాజకీయ రణక్షేత్రంలో ఏ రాజకీయ పార్టీకైనా బలం, బలగం… కార్యకర్తలే. పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా ఉన్న వారికి ఎదురే ఉండదు. అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం.. సిద్ధాంతాలు, ఆలోచనలను ప్రజల్లోకి ప్రభావితంగా తీసుకు వెళ్లడం, సభ్యత్వ నమోదులో కార్యకర్తలదే ప్రధాన భూమిక. ఆంధ్రప్రదేశ్ లోని జనసేన ఇప్పుడు అదే బలంతో ముందడుగు వేస్తోంది. తన బలగంతో మరింత సమర్థవంతంగా గ్రామ స్థాయిలో బలోపేతమవుతోంది.
గ్రామస్థాయిలో బలోపేతమే రాజకీయ పార్టీలకు ప్రధాన బలంగా కనిపిస్తాయి. పట్టణ ఓటర్లు మారుతున్న సమీకరణాల ఆధారంగా తమ అభిప్రాయాలను మార్చుకుంటుంటారు. అందుకే.. రాజకీయ పార్టీలన్నీ గ్రామీణ ప్రాంత ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి తంటాలు పడుతుంటాయి. అయితే… 2023 నవంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సమీకరణాలకు విరుద్ధంగా నడిచిన భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్).. ఊహించని షాక్ కు గురైంది. కేవలం పట్టణ ప్రాంతాలపై దృష్టి పెట్టి, పల్లెలను పట్టించుకోక పోవడంతో ఫలితాల రోజు బోల్తా పడింది.
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల అభివృద్దిపై పెట్టిన శ్రద్ధ గ్రామాల అభివృద్ది పెట్టక పోవడంతో జనం ఆ పార్టీని పక్కన పెట్టారు. ఇదే తరహా తీర్పు ఏపీ లోనూ ఎదురైంది. సంక్షేమ పథకాల అమలు చేస్తే చాలు… ఓట్లు రాలుతాయనుకున్న వైసీపీ అధినేత జగన్ ప్రజాక్షేత్రం తిరుగుబాటుకు గురయ్యాడు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఛాయలు లేకపోవడంతో ఓటర్లంతా జగన్ ఛీదరించుకున్నారు. ఫలితంగా 2024 మేలో జరిగిన ఎన్నికల్లో వైసీపీని నామరూపాల్లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండిటికీ భిన్నంగా పదేళ్ల క్రితమే పురుడు పోసుకున్న జనసేన వ్యవహరిస్తోంది. పట్టణాలతో పాటు పల్లెల్లో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉన్న విపరీతమైన క్రేజ్… ఆ పార్టీకి ప్రధాన బలంగా కనిపిస్తోంది.
పంచాయతీలపై పట్టు…
స్థానిక సంస్థల ఎన్నికలైన సర్పంచ్‌లు, మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు రాజకీయ పార్టీలన్నీ తంటాలు పడుతుంటాయి. వీలయినన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా సార్వత్రిక ఎన్నికల్లో సైతం విస్తరించడం ఎన్నికల వ్యూహం. అయితే… జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ఆ పార్టీ సభ్యత్వాలపై ప్రభావం చూపిస్తోంది. జూలైలో చేపట్టిన సభ్యత్వ నమోదులో గ్రామ స్థాయి నుంచి పట్టణ ప్రాంతాల్లో కూడా భారీగా సభ్యత్వాలు నమోదయ్యాయి. పవన్ కల్యాణ్ సైతం పార్టీ కార్యకర్తల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం, సభ్యత్వం కలిగిన వారికి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా జీవిత బీమా, ప్రమాద బీమా అమలు చేయడం కూడా కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు.