Andhra Pradesh : ఏపీలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు భయపడి ప్రజలు ఉదయం 8 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అలానే ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో తడిసిపోతున్నారు. ఈ వేసవి ప్రకోపానికి ముఖ్యంగా వృద్ధులు, రైతులు, కూలీలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా తాజాగా అందిన సమాచారం మేరకు వడదెబ్బతో రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 10 మంది కన్నుమూశారని తెలియడం ప్రజల్ని మరింత భయపెడుతుంది.
కృష్ణా జిల్లా –
అవనిగడ్డకు చెందిన కూనపురెడ్డి చలపతి (103).
గుడ్ల వల్లేరు మండలం కౌతవరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ పి.శివనాగరాజు (45).
ప్రకాశం జిల్లా –
సంతనూతలపాడులో వి.ప్రసాదరావు (65)
జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో పుట్టా శంకర్‌రెడ్డి (62)
శ్రీకాకుళం జిల్లా – ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన రైతు పేడాడ సింహాచలం (63)
తిరుపతి జిల్లా – గూడూరు నియోజకవర్గం వాకాడు బంగ్లాతోట గిరిజన కాలనీ వాసి, పైడి కస్తూరయ్య (50).
బాపట్ల జిల్లా – బాపట్ల మండలం లోని పిన్నిబోయినవారి పాలేనికి చెందిన కూలీ బి.రమణయ్య (55).
ఎన్టీఆర్ జిల్లా – నందిగామ మండలం ఐతవరం సొసైటీ మాజీ అధ్యక్షుడు చలమాల కోటేశ్వరరావు (75)
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా – ఆత్రేయపురం మండలం తాడపూడికి చెందిన కూలీ ఆర్.శ్రీనివాసరావు (40)
తూర్పుగోదావరి జిల్లా – దేవరపల్లి మండలం యాదవోలు వాసి చెప్పుల సామేలు (55)
ఈ వారంలోనే గడిచిన ఆదివారంతో పోలిస్తే.. మంగళవారం నాటికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నం మినహా మిగిలిన కోస్తా జిల్లాలన్నింటిలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైకి చేరాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 10 గంటలకే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా చేరాయి. కాకినాడ, అనకాపల్లి, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి.
రాష్ట్రవ్యాప్తంగా 40 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం నాడు రాష్ట్రంలోని 16 మండలాల్లో 46 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 45 డిగ్రీలకుపైగా 39 మండలాల్లో, 42 నుంచి 44 డిగ్రీల మధ్య 255 మండలాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా జరుగుమల్లి, కనిగిరి మండలాల్లో రాత్రి 8గంటల తర్వాత కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు పైనే ఉన్నాయి. ఇక ఈరోజు కూడా రాష్ట్రంలో గరిష్ఠంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అప్రమత్తం చేసింది.