Guntur-Guntakal : గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైలు మార్గం పనులు చివరిదశకు చేరుకున్నాయి. 401కిలోమీటర్ల మార్గం డబ్లింగ్, విద్యుదీకరణకు రూ.3,631 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్రం ఐదేళ్ల క్రితం అనుమతి ఇచ్చింది. ఈ మొత్తం వ్యయంలో రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్రం చేరి సగం భరించాలని ఒప్పందం ఉంది. ఇప్పటివరకు 347 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు. పనులు పూర్తయితే బెంగళూరు, గోవాతోపాటు రాయలసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రకు, రాజధాని అమరావతికి వేగంగా చేరుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మార్గంలో నడిచే రైళ్లకు 1.30 సమయం ఆదా అవుతుంది. దేశ తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగనుంది. కొత్త రైళ్లు ప్రారంభించేందుకు అవకాశం ఉంది. దీంతో గోవా ఓడ రేవు నుంచి మచిలీపట్నం వరకు వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా విస్తరిస్తాయని భావిస్తున్నారు.
ముమ్మరంగా పనులు
చలమ వద్ద 0.34 కిలోమీటర్ల సొరంగం తవ్వి పనులు చేయాల్సి ఉంది. వీటిని ఇప్పటికే ప్రారంభించారు. బొగడ దగ్గర 1.6 కిలో మీటర్ల సొరంగం పనులు ప్రారంభించాల్సి ఉంది. దీన్ని కోసం ఇప్పటికే అటవీ శాఖ అనుమతి తీసుకున్నారు. రెండు దశ పనులు 2026 డిసెంబరుకు పూర్తి కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. పనులు పూర్తైన మార్గంలో ట్రైన్ రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దిగువమెట్ల-నంద్యాల మార్గంలో 40 కిలోమీటర్ల పనులు చేపట్టాల్సి ఉంది. ఇందులో దిగువమెట్ల-గాజులపల్లి మధ్య 27 కిలో మీటర్ల పనులు రెండు సొరంగాలతో ఆలస్యంగా కొనసాగుతున్నాయి. అందువల్ల గాజులపల్లి-నంద్యాల మార్గం 13కిలో మీటర్ల పనులు ప్రారంభించారు. పనులను ఈ ఏడాది నవంబరుకు, నంద్యాల-పాణ్యం 14కిలో మీటర్ల పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డీఆర్‌ఎం రామకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకొని డబ్లింగ్ పనులు త్వరగా పూర్తయ్యేందుకు చర్యలు చేపట్టారు.