Deputy CM Pawan Kalyan Speech in Assembly: గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. అసెంబ్లీలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వం పాసు పుస్తకాలకు సైతం తమ ఫొటోలు వేసుకున్నారన్నారు. కానీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ అన్నారు. చంద్రబాబు పాలనపై సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. సమర్థులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనే విషయాన్ని చంద్రబాబు నిరూపించారన్నారు.
ఏపీ సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. రైతులకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు చేతల్లో చూపించారన్నారు. విజయవాడ వరదల సమయంలో ఆయన అధికార యంత్రాంగాన్ని దగ్గరుండి నడిపించారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పనిచేసిన తీరు ఆదర్శమని కొనియాడారు. గత పాలనలో అన్ని వ్యవస్థలు వెనుకబడ్డాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గాడిలో పెడుతున్నామన్నారు. చంద్రబాబు అనుభవం పాలనలో ప్రత్యక్షంగా కనిపిస్తుందన్నారు. 150 రోజుల చంద్రబాబు పాలనలో సంతృప్తి చెందామని వివరించారు.
అమరావతి రోడ్ల నిర్మాణంలో వినూత్న రీతిలో ముందుకెళ్తున్నామని తెలిపారు. రూ.75 కోట్లతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్ర పాలనను గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబును గత ప్రభుత్వం జైలులోపెట్టి తీవ్ర ఇబ్బందులు పెట్టిందన్నారు. కానీ తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబు ముఖ్య కారణమన్నారు. అలాగే నేరాల నిర్మూలనకు హోంమంత్రి అనిత తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు.
గత ప్రభుత్వం ఏ రోజూ కూడా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదని పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం పాస్ బుక్కులపై కూడా జగన్ ముద్ర వేసుకున్నారన్నారు. అంతకుముందు ప్రశ్నోత్తరల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు.
ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తామని భరోసా కల్పించారు. అలాగే కలుషిత నీరు అనే పదం వినపడకుండా చేస్తామని, కిడ్నీ సమస్యలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జలజీవన్ మిషన్ అమలులో దేశానికే ఏపీ ఆదర్శంగా ఉండేలా చేస్తామన్నారు. అయితే కొంతమంది సభ్యులు ఆర్వో ప్లాంట్లు పాడైపోయినట్లు సభ దృష్టికి తీసుకొచ్చారన్నారు. వెంటనే పాడైపోయిన ఆర్వో ప్లాంట్లను పునరుద్ధరిస్తామని వపన్ కల్యాణ్ అన్నారు.