Deputy CM Pawan Kalyan: వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం.. గాడిలో పెడుతున్న కూటమి ప్రభుత్వం

Deputy CM Pawan Kalyan Powerful Speech in Assembly: వైసీసీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అన్నీ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను గాడిలో పెడుతున్నామన్నారు. బుధవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పవన్ మాట్లాడారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఏపీగా మార్చారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు అనుభవం పాలనలో ప్రత్యక్షంగా కనిపిస్తుందన్నారు. రాష్ట్ర పాలనను గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. 150 రోజుల సీఎం పాలనలో సంతృప్తి చెందామన్నారు. ఏపీ సమగ్రాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. రైతులకు అండగా ఉంటామని సీఎం చేతల్లో చూపించారన్నారు. ఐదేళ్లలో ఏపీ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్ల వైపు ఆంధ్రప్రదేశ్ వెళ్తుందన్నారు. బాబు పాలనపై నాకు సంపూర్ణ నమ్మకం ఉందన్నారు. మధ్యాహ్నం భోజనం పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం అభినందనీయమన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాబు పనితీరు ఆదర్శం…
50ఏళ్లలో ఎన్నడూలేని విధంగా విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కట్టలు తెగిపోవడంతో అజిత్‌ సింగ్‌ నగర్‌, రాజరాజేశ్వరీపేట, పైపుల్‌ రోడ్‌, రాజీవ్‌ నగర్‌, కండ్రిక, జక్కంపూడి కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టింది. వరదల సమయంలో సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని దగ్గరుండి నడిపించారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పనిచేసిన తీరు ఆదర్శమని పవన్ కొనియాడారు.

రూ.75 కోట్లతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు..
జగన్ ప్రభుత్వంలో ఏపీలో రోడ్లు గుంతలమయంగా మారాయని పవన్ అన్నారు. వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అమరావతి రోడ్ల నిర్మాణంలో వినూత్న రీతిలో ముందుకెళ్తుందన్నారు. గుంతల రోడ్లకు రూ.890కోట్లు విడుదల చేశామన్నారు. రూ.75 కోట్లతో రాష్ర్టంలో నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయన్నారు. అమరావతి రైల్వే పనులను కేంద్రం సహకరిస్తుందన్నారు. రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని చెప్పారు. 30 నుంచి 40 వేల కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. సంక్రాంతి వరకు రోడ్ల పనులను పూర్తిచేస్తామన్నారు.

జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేశారు..
చంద్రబాబు చేయని తప్పుకు వైసీపీ ప్రభుత్వం జైలుకు పంపి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి 53 రోజులుపాటు వేధించిందన్నారు. సోషల్ మీడియాలో సొంత తల్లి, చెల్లిని కూడా చూడకుండా బూతులు తిట్టించారని గుర్తుచేశారు. 45 ఏండ్ల పాటు ఎన్నో ప్రజాప్రయోజన పాలసీలు తీసుకొచ్చారన్నారు. సంక్షేమ కార్యక్రమాలు తెచ్చి, ప్రజల కోసమే పని చేశానన్నారు. తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఉండడానికి చంద్రబాబు ముఖ్య కారణమన్నారు.

నేరాల నిర్మూలనకు హోంమంత్రి చర్యలు అభినందనీయం..
ఆంధ్రప్రదేశ్ లో నేరాల నిర్మూలనకు హోంమంత్రి అనిత తీసుకున్న చర్యలు అభినందనీయమని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఇసుక దోపిడీని అరికట్టడానికి మంత్రివర్గం కృషి చేస్తుందన్నారు. శాఖలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్ ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మహిళలపై వైసీపీ నేతలు ఆవాకులు చెవాకులు పేల్చి బూతులు మాట్లాడారని మండిపడ్డారు.
గత వైసీపీ ప్రభుత్వం ఏ రోజూ కూడా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం పాస్ బుక్కులపై కూడా జగన్ ముద్ర వేసుకున్నారన్నారు.

కలుషిత నీరు అనే మాట వినపడకుండా చేస్తా
కలుషిత నీరు అనే మాట వినపడకుండా చేస్తామని పవన్‌ అన్నారు. రక్షిత మంచి నీరు ప్రతిఒక్కరి హక్కు అన్నారు. ప్రతి ఇంటికి తాగు నీరందిస్తామని భరోసానిచ్చారు. జలజీవన్‌ మిషన్‌ అమలులో ఏపీ దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. కిడ్నీ సమస్యలు తగ్గిస్తామని తెలిపారు. చాలా ఆర్వో ప్లాంట్లు పాడైపోయాయని సభ్యులు సభ దృష్టికి తీసుకు వచ్చారు. వాటిని పునరుద్ధరిస్తామన్నారు. ఒక ఉద్ధానంలోనే కాదు.. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో కిడ్నీ బాధితులు ఉన్నారని గుర్తుచేశారు. జలజీవన్‌ మిషన్‌ కు కమిటెడ్‌ లీడర్‌ షిప్‌ కావాలన్నారు. కలుషిత నీరు తాగి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పెరిగారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లాలో దళిత మహిళ నీళ్లివ్వాలని అడిగితే తనకు కన్నీళ్లు వచ్చాయంటూ పవన్‌ గుర్తుచేసుకున్నారు. మార్చి 2027లో జలజీవన్‌ మిషన్‌ పూర్తయిపోవాలన్నారు. ఈ లోపు ప్రతీ ఒక్కరికీ స్వచ్ఛమైన నీరు అందాలని పవన్‌ స్పష్టం చేశారు.