Site icon Prime9

Deputy CM Pawan Kalyan: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. విధి విధానాలపై ఎమ్మెల్యేలకు పవన్ సూచన

Deputy CM Pawan Kalyan Meeting With Jana Sena MLAs and MPs: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగింది. ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ విధానాలను జనసేన ఎమ్మెల్యేలకు పవన్ వివరించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం చట్టసభల్లో తన అనుభవాలను సీనియర్ ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్‌తోపాటు కందుల దుర్గేష్ తోటి ఎమ్మెల్యేలతో పంచుకున్నారు.

వైసీపీ భాష వద్దు..
ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపిద్దామని పార్టీ ఎమ్మెల్యేలకు పవన్పిలుపు నిచ్చారు. ప్రజల సమస్యలను, ఆకాంక్షలను చట్టసభల్లో చర్చిద్దామని సూచించారు. మనం మాట్లాడే భాష హుందాగా ఉండాలన్నారు. వైసీపీ భాష వద్దని జనసేన ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. పార్టీ తరఫున ఎన్నికైన ప్రతి శాసన సభ్యుడు, మండలి సభ్యులు చర్చల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శాసనసభ సంప్రదాయం, మర్యాదను కాపాడుతూ హుందాగా ముందుకు వెళ్లాలన్నారు. చట్ట సభల్లో ఎంత విలువైన చర్చలు జరిగేవో ఒకసారి అందరూ పరిశీలించాలని, ఎప్పటికప్పుడు సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకొని చర్చల్లో పాల్గోనాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన పిలుపునిచ్చారు.

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు..
బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఈ నెల 28న సభలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. అసలు ఈ బడ్జెట్‌ను మార్చి 4వ తేదీన ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తొలుత భావించింది కానీ.. అనివార్య కారణాల వల్ల నాలుగు రోజుల ముందుకు జరిపింది.

శిక్షణా తరగతులు వాయిదా..
మరోవైపు ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడితోపాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భావించారు. అందుకోసం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సభలో సభ్యులు ఎలా మసులుకోవాలనే అంశంపై పార్టీ సీనియర్లతో కొత్తగా ఎన్నికైన జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఆయనతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సభను తరలి రానున్నారు.

సభ్యులందరూ సభకు హాజరు కావాలి..
మరోవైపు 47వ శాసన మండలి, 16వ శాసనసభ మూడవ సమావేశ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పాట్లకు సంబంధించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్‌గుప్తాతో సమీక్ష నిర్వహించారు. గవర్నర్ ప్రసంగం జరిగే రోజు ఉదయం 9.30 గంటలకు సభ్యులందరూ సభకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

వ్యక్తిగత సహాయకులకు నో ఎంట్రీ..
బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, అధికారుల వ్యక్తిగత సహాయకులకు పాసులు జారీ చేయడం లేదని స్పష్టం చేశారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశం ఉండదని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రిని కలిసే సందర్శకులు, ప్రతినిధులను శాసనసభ ప్రాంగణంలోకి అనుమతించరని చెప్పారు. అందుకోసం వచ్చేవారు… సీఎంవోలనే భేటీ కావాల్సి ఉంటుందని సూచించారు. శాసనసభ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పోలీసు శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి..
సమావేశాల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న మీడియా పాయింట్, కొత్తగా నిర్మిస్తున్న క్యాంటీన్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా పరిశీలించి పలు కీలక సూచనలు చేశారు. సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ కార్యదర్శి జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర ఇతర ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version
Skip to toolbar