Deputy CM Pawan Kalyan About RRR: నవ్విన నాప చేనే పండిందన్న సామెత నిజమైంది. ఎవరినైతే… తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే అడుగు పెట్టనివ్వమని సవాల్ చేశారో… వారే అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. ఆ ఛాలెంజ్ చేసిన వారే కనీసం సభలోకి కూడా రాకుండా జనం గత ఎన్నికల్లో స్క్రిప్ట్ రాశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దీనికి సాక్ష్యం కాగా.. డిప్యూటీ స్పీకర్ గా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎన్నిక… ఈ రసవత్తర ఘటనకు వేదికగా మారింది.
చట్టపరంగా చర్యలు
ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేయగా, దేశ స్వాతంత్య్రం.. రాష్ట్ర అవతరణ సాధ్యమైందని డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. దీనిని దుర్మార్గుల చేతుల్లోకి, నేరస్తుల కబంద హస్తాల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపైనే అధికంగా ఉందని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఏకగ్రవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పవన కల్యాణ్ మాట్లాడారు. రాజకీయాల్లో నేరుస్తులకు స్థానం ఉండకూడదని, దురదృష్టవశాత్తు 2019లో నేరస్తులే అధికారంలోకి వచ్చారని విమర్శించారు. గత ప్రభుత్వం రాజకీయాలను నేరమయం చేసిందని, నేర చరిత్ర ఉన్న వాళ్లకు అధికారం ఇస్తే ఏం జరుగుతుందో అంతా చూశామని మండిపడ్డారు. పక్క వాళ్లపై బురద జల్లి, వికృత ఆనందం పొందడం వైసీపీ నైజమని, ఇకపై వారి ఆటలు సాగవని స్పష్టంచేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారాజ్యంగా ఇతరులను ఇబ్బందులు పెట్టేలా పోస్టింగులు పెట్టేవారిపై చట్టపరంగా చర్యలు తప్పవని తెలిపారు. దీనికి అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం సోషల్ మీడియా అబ్యూసింగ్ ప్రాటక్షన్ యాక్ట్ పేరిట ప్రత్యేక బిల్లు ప్రవేశ పెట్టాలని కోరారు.
సవాల్ చేసిన వాళ్లే..
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో రఘురామను అడుగు పెట్టమని సవాల్ చేసిన వాళ్లే.. ఈరోజు సభలో అడుగు పెట్టలేక పోయారని కర్మ అంత బలంగా ఉంటుందని డిప్యూటీ సీఎం ఆక్షేపించారు. ఉండి అసెంబ్లీ నుంచి 56వేలకు పైగా మెజార్టీతో గెలుపొంది, సభలో అడుగు పెట్టారని అభినందించారు. ఎన్నో చిత్రహింసలకు గురి చేసి, మానసిక ఆనందాన్ని పొందారని విమర్శించారు. అటువంటి వారికి.. ప్రజలే తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. రఘురామ రాజకీయ ప్రస్థానం ఎంతో స్ఫూర్తి దాయకమని, పోలీసులను అడ్డం పెట్టుకుని, ఆయననే లేకుండా చేయాలని ఎన్నో కుట్రలు పన్నారని గుర్తుచేశారు. ఎన్ని ఉన్నా… అన్నిటికీ తట్టుకుని నిలబడటంతో పాటు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక కావడం ఆనందంగా కొనియాడారు.
వైసీపీ చిత్ర హింసలను తట్టుకొని…
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయ్యిందో… రఘురామ కృష్ణంరాజు రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంత పాపులర్ అయ్యిందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రఘురామకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని, తెలుగు బిడ్డగా పంచెకట్టులో వచ్చిన రఘరామ డిప్యూటీ స్పీకర్ స్థానానికి నిందుతనం తీసుకొచ్చారని ప్రశంసించారు. కొత్త బాధ్యతలో ఆయనను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. వైసీపీ అరాచక ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు, అవరోధాలు ఎదుర్కొన్నా… ధీటుగా ఎదుర్కొన్న పోరాట యోధుడని కొనియాడారు.
ఏకగ్రీవంగా ఆర్‌ఆర్‌ఆర్ ఎన్నిక..
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘరామ కృష్ణంరాజు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ సందర్భంగా సభాపతి సహా, సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు, సభ్యులు రఘురామను సభాపతి కుర్చీ వరకు గౌరవ పూర్వకంగా తీసుకు వెళ్లి, కూర్చోబెట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసి, గెలుపొందిన ఆయన… అప్పటి ప్రభుత్వ విధానాలు నచ్చక సొంత పార్టీ పైనే తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. జగన్ పాలిట సింహస్వప్నంలా మారారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలను ఎండగట్టేవారు. దీంతో ఆగ్రహానికి గురైన వైసీపీ సర్కార్.. రఘురామపై ఏకంగా రాజద్రోహం కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయడంతో పాటు విచారణ పేరుతో చిత్రహింస లకు గురి చేశారు. రాష్ట్రంలో ఎక్కడా అడుగు పెట్టనీవ్వకుండా, పోలీసులను ఆయన పైకి ఉసిగొల్పి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీంతో పార్లమెంట్ సమావేశాలు ఉన్నా, లేకపోయినా… ఎక్కువ కాలం ఢిల్లీ లోనే మకాం వేసేవారు. అనంతరం 2024లో వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరడంతో పాటు ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రుషికొండపై రచ్చరచ్చ…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా విశాఖ లోని రుషికొండ ప్యాలెస్ పై కొద్దిసేపు చర్చ జరిగింది. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ… రుషికొండ ప్యాలెస్ లోని వస్తువులు చూస్తూ ఎవ్వరికైనా మతి పోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన తీరు చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. తలుపుల కోసం రూ.31 లక్షలు, బాత్ రూమ్ కమోడ్ కోసం రూ.11 లక్షలు వినియోగించారని విమర్శించారు. ప్యాలెస్ లో వాడినంత ఖరీదైన ఫర్నీచర్ తానెక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. రుషికొండ విషయంలో భారీగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన జగన్ ను జీతితాంతం జైలులో ఉంచినా తప్పులేదనని ధ్వజమెత్తారు. పర్యాటక ముసుగులో నిర్మాణాలు తలపెట్టి, అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విలాస వంతమైన భవనాల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు రాష్ట్ర ప్రజలకు తెలిసేలా వారిని సందర్శనకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు.