Site icon Prime9

AP CM Chandrababu : విద్యుత్‌ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనే.. సీఎం చంద్రబాబు

AP CM Chandrababu

AP CM Chandrababu

AP CM Chandrababu : విద్యుత్‌ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభలో ఇంధన శాఖపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

 

1988లోనే విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూషన్‌, జనరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌గా విభజించి, ఎనర్జీ ఆడిటింగ్‌ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. విద్యుత్ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేశామన్నారు. ఆ రోజు తీసుకు వచ్చిన సంస్కరణల ఫలితాలను చూసి సంతోషపడ్డామన్నారు. వ్యవసాయానికి యూనిట్‌కు వసూలు చేసే పరిస్థితి నుంచి శ్లాబ్‌ ధరతో రైతులను ఆదుకుంది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. 2014లో ఏపీలో 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్ కొరత ఉండేదని, కేంద్రం సహకారంతో దాన్ని సవాల్‌గా తీసుకున్నట్లు చెప్పారు. 2014 డిసెంబర్‌కు ఎక్కడా కరెంట్‌ కొరత లేకుండా చేశామన్నారు.

 

జనవరి 2018 నాటికి మిగులు విద్యుత్‌ సాధించిన రాష్ట్రంగా మార్చామన్నారు. ఇప్పుడు గర్వంగా చెబుతున్నానని, 9 గంటలు వ్యవసాయానికి విద్యుత్ ఇస్తున్నామన్నారు. తాను 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యేసరికి 10 నుంచి 15 గంటలపాటు విద్యుత్ కోతలుండేవని గుర్తుచేశారు. పరిపాలన ఎలా ఉండాలో ఆలోచించి, అందుకు అనుగుణంగా ప్రణాళికలతో ముందుకెళ్లినట్లు తెలిపారు. మీటర్‌ రీడింగ్‌ కోసం స్పాట్‌ బిల్లింగ్‌ తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ప్రపంచం మొత్తం అధ్యయనం చేశామని, ప్రపంచ బ్యాంకు జీతగాడు అని తనపై విమర్శలు చేశారని చంద్రబాబు అన్నారు.

 

అంతర్జాతీయ అంశంగా పీపీఏల రద్దు
విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని గత వైసీపీ ప్రభుత్వం లోటు పరిస్థితికి తీసుకెళ్లిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పరిశ్రమలు కరెంట్‌ వాడితే సర్‌ఛార్జీ విధించిన ఘనత వైసీపీదేనని అన్నారు. ఏపీలో తలసరి విద్యుత్ వినియోగం 23 శాతం పెరిగిందని చెప్పారు. సౌర, పవన విద్యుత్‌ను 7700 మెగావాట్లు మేర ఉత్పత్తి చేసిన మొదటి రాష్ట్రం ఏపీ అని తెలిపారు. 2019-24 మధ్య అసమర్థ పాలనతో ఏపీలో మళ్లీ చీకటి రోజులు వచ్చాయన్నారు. ఆలోచన లేకుండా వైసీపీ ప్రభుత్వం పీపీఏలను రద్దు చేసేసిందని, ఆ విషయం అంతర్జాతీయ అంశంగా మారిపోయిందని గుర్తుచేశారు. దావోస్‌లో దీనిపై చర్చ జరిగిందన్నారు. ఒక వ్యక్తి ఈగో కారణంగా ఏపీ ఖజనా నుంచి రూ.9 వేల కోట్లు పీపీఏలకు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version
Skip to toolbar