Site icon Prime9

Chandrababu : అదనంగా లక్ష ఎకరాల్లో అరకు కాఫీసాగు విస్తీర్ణం పెంచాలి : సీఎం చంద్రబాబు

Chandrababu

Chandrababu

Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇవాళ సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 

 

బడుగుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు..
కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. పీ4లో భాగంగా సమాజంలో అట్టడుగు పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. డ్వాక్రా, మహిళా సంఘాల ద్వారా పేదలను గుర్తించి వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకొచ్చేందుకు వన్‌ ఫ్యామిలీ – వన్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చామన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త ఉండేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.

 

 

అరకు కాఫీని ప్రోత్సహించాలి..
గిరిజన సంక్షేమంలో భాగంగా ఆరకు కాఫీని ప్రోత్సహించాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో అదనంగా లక్ష ఎకరాల్లో అరకు కాఫీ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాఫీ సాగులో అంతరపంటగా వేసే నల్ల మిరియాలు, స్ట్రాబెర్రీ, అవకాడో, యాపిల్, జీడి వంటి పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలని సూచించారు. గిరిజన ఉత్పత్తుల పరిరక్షణకు అవసరం అయితే డ్రోన్ టెక్నాలజీని వాడుకోవాలన్నారు. సేంద్రియ సేద్యానికి అరకులో మంచి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వనరులు ఉన్నాయని, ఆదివాసీల్లో చైతన్యం లేక వెనకబడి ఉన్నారని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

 

 

ఏపీలో సొంత ఇల్లు లేని వారు ఎవరూ ఉండకూడదని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇచ్చేలా కలెక్టర్లు పనిచేయాలని సూచించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Exit mobile version
Skip to toolbar