CM Chandrababu Aggressive Speech In AP Assembly sessions: రాజకీయ కక్షలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. తన జీవితంలో రాజకీయాలకు సంబంధించి ఎలాంటి కక్షలు ఉండవని స్పష్టం చేశారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారని గుర్తు చేశారు. కొంతమంది ఆకతాయిలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు.
నాగరిక సమాజంలో శాంతి భద్రతలు చాలా ముఖ్యమని, గత పాలనలో ప్రజలు స్వేచ్ఛగా తిరగలేకపోయారన్నారు. నాతో పాటు ఇక్కడ ఉన్న చాలామంది వైసీపీ బాధితులే ఉన్నారన్నారు. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ కక్షపూరితంగా వ్యవహరించలేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, ఎలాంటి సమస్యలైనా సృష్టించినట్లు ప్రభుత్వం దృష్టికి వస్తే ఉపేక్షించమని హెచ్చరించారు.
ఇక, రౌడీలు రాష్ట్రం నుంచి పారిపోవాలని గతంలోనే చెప్పామన్నారు. రౌడీ అనే వాడు రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదని చంద్రబాబు అన్నారు. గడిచిన ఐదేళ్లు అసెంబ్లీలో కూడా బూతులే వినిపించాయని, ప్రస్తుతం రాష్ట్రంలో బూతులు వినపడటం లేదన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉపేక్షించమన్నారు.
కొంతమంది గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అలవాటు చేసుకొని ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై ఉక్కుపాదం మోపామని వెల్లడించారు. టెక్నాలజీ ఉపయోగించి గంజాయిని నిర్మూలిస్తున్నామని, ఇందు కోసమే ఈగల్ వంటి ప్రత్యేక సిస్టమ్ తీసుకొచ్చామని, గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై యుద్ధం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క ఎకరాలో కూడా గంజాయి పండించడానికి వీల్లేదన్నారు. రాష్ట్రంలో వీటి నిర్మూలన జరిగే వరకు ఈ యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.