Site icon Prime9

Chandrababu : పోలవరం ప్రాజెక్టును జగన్‌ పక్కన పెట్టారు : సీఎం చంద్రబాబు

Chandrababu

Chandrababu

Chandrababu : పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సిందని, కావాలనే దానిని వైఎస్ జగన్ పక్కన పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలవరం నిర్వాసితులకు రూ.10లక్షలు ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత పైసా కూడా వివ్వలేదని సీఎం విమర్శించారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించి, నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. అంతకుముందు ఏరియల్‌ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు.

 

 

 

టీడీపీ హయాంలో నిర్వాసితులకు రూ.4,311 కోట్లు..
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్వాసితులకు రూ.4,311 కోట్లు చెల్లించామని గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాసితులకు రూ.10లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. నిర్వాసితులను చూస్తే తనకు బాధ వేస్తోందన్నారు. 2019లో టీడీపీ అధికారంలో ఉంటే, 2020లోనే ప్రాజెక్టు పూర్తయ్యేదని తెలిపారు. 2014, 2019 మధ్యన మొత్తం 33సార్లు ప్రాజెక్టును సందర్శించానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిధులను గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు.

 

 

 

గత ప్రభుత్వం పట్టించుకోలేదు..
వరదలు వచ్చిన సమయంలో గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారని గుర్తుచేశారు. వారిలో కొందరి రైతులకు మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారని ఆరోపించారు. నిన్నమొన్నటి వరకు నిర్వాసితులను పట్టించుకున్న నాథుడు లేడని మండిపడ్డారు. వీలైనంత త్వరగా పరిహారం ఇస్తామని సీఎం హామీనిచ్చారు. కేంద్రాన్ని ఒప్పించి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశామని. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్‌ పక్కన పెట్టారని ఆరోపించారు. ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారని దుయ్యబట్టారు.

 

 

 

రూ.829 కోట్లు నిర్వాసితుల ఖాతాలో వేశాం..
రూ.829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాలో వేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పోలవరంలో నీళ్లు వదిలే ముందే 2027 నవంబర్‌ నాటికి పునరావాసం పూర్తిచేస్తామన్నారు. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిర్మాణంలో ఆలస్యం వల్ల హైడల్‌ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందన్నారు. 2027 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిందని, సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేసుకుందామన్నారు.

Exit mobile version
Skip to toolbar