Prime9

Chandrababu : పార్టీలో ప్రతిఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నాం : ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Teleconference : పార్టీలో ప్రతిఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన మార్పు చూపించామన్నారు. శనివారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీలో ప్రతిఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నామని, బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహం ఉంటుందన్నారు. పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటామని హెచ్చరించారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలని కోరారు. ప్రజలు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. ఒకసారి ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదనేది తన ఆలోచన అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

 

గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ చీకటి అలముకుందన్నారు. భయంకర పరిస్థితులను ప్రజలు చూశారని గుర్తుచేశారు. ఏపీ పేరు వింటేనే దగ్గరకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారని దుయ్యబట్టారు. అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని ఆర్థికంగా పాతాళానికి తొక్కేశారని ఫైర్ అయ్యారు. మనం తీసుకునే నిర్ణయాలతో మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వాన్ని భరించలేకే ప్రజలు ఏకపక్షంగా కూటమిని గెలిపించారన్నారు. ప్రతి ఆరు నెలలకోసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తానని తెలిపారు. మంచి చేస్తే అభినందిస్తానని, తప్పు చేస్తే దూరం పెడతామని తేల్చిచెప్పారు. త్వరలో ఒక్కో ఎమ్మెల్యేతో ముఖాముఖి నిర్వహిస్తామన్నారు. ఎవరు అడ్డుపడినా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదన్నారు. ఈ నెల 12 లేదా 14 లోగా తల్లికి వందనం నగదు తల్లులకు అందిస్తామని చంద్రబాబు తెలిపారు.

 

టెలీ కాన్ఫరెన్స్‌లో ఏడాది పాలనపై 12న నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అదే రోజున సాయంత్రం ఎన్డీయే పక్షాలు, అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే నాలుగేళ్లలో చేపట్టే కార్యక్రమాలపై చర్చించనున్నారు.

Exit mobile version
Skip to toolbar