Lookout Notices Issued to Former Minister Kodali Nani: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని మరోసారి బిగ్ షాక్ తగిలింది. తాజాగా, ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ టుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ముంబైలో కొడాలి నానికి గుండె ఆపరేషన్ చేసుకున్నారు.
వివరాల ప్రకారం.. కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ తరుణంలో ఆయన అమెరికాకు పరారయ్యే అవకాశం ఉందని టీడీపీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అమెరికా వెళ్తారన్న అనుమానంతో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు లుకౌట్ సర్క్యూలర్ జారీ చేశారు
అనారోగ్య కారణాలతో అమెరికాకు పారిపోయే అవకాశం ఉందని సందేహిస్తూ కృష్ణా జిల్లా డీజీపీకి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వెంటనే ఎయిర్ పోర్టులు, ఓడరేవులకు సైతం నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, కొడాలి నాని 2019లో పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఆయనపై పలు కేసులు నమోదై ఉండడంతో తిరస్కరించారు. అయితే ఏపీ చిరునామాతో పాస్ పోర్టు లేకపోయినప్పటికీ హైదరాబాద్ అడ్రస్‌తో పాస్ పోర్టు ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా ఆయన కదలికలపై నిఘా ఉంచడంతో పాటు పాస్ పోర్టు సీజ్ చేయాలని టీడీపీ నేత కనపర్తి పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలోనే కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు అందాయి.