Bear Attack : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల జూపార్క్‌లో విషాద ఘటన జరిగింది. జంతు సంరక్షకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఉదయం జూపార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తున్న.. ఉద్యోగిపై ఎలుగుబంటి దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తుంది. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని క్లీనింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. జూలో ఉన్న సందర్శకులు అందరూ చూస్తుండగానే ఎలుగుబంటి ఆ యువకుడిపై దాడి చేయడంతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఘటనలో గుర్తించిన జూ అధికారులు వెంటనే స్పందించి ఆ ఎలుగుబంటిని బంధించారు. తీవ్రగాయాల పాలైన ఆ ఉద్యోగిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతి చెందిన వ్యక్తి పేరు నగేష్ గా వెల్లడించారు. రెండేళ్లుగా జూ పార్క్‌లో అవుట్ సోర్సింగ్‌లో నగేష్ పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ సంఘటనతో జూలో సిబ్బందికి, సందర్శకులకు భద్రత కరువైందని ప్రజలు భావిస్తున్నారు. ఆరిలోవ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి 10లక్షలు పరిహారాన్ని అటవీశాఖ ప్రకటించింది.
జూ క్యూరేటర్ నందనీ సలారియా మాట్లాడుతూ.. నగేష్ అనే సంరక్షకుడు ఎలుగుబంటి ఉండే ఎన్‌క్లోజర్ వద్ద క్లీనింగ్‌కు వెళ్ళాడు. అదే సమయంలో ఎలుగుబంటి హెల్త్ చెకింగ్ కోసం వెళ్ళిన డాక్టర్ కీపర్ నగేష్ కోసం వాకబు చేశాడు. అప్పటికే ఎలుగుబంటి తన ఎన్‌క్లోజర్ బయట ఉండడంతో తొలుత దానిని లోపలకు పంపి నగేష్ కోసం వెతకగా ఎన్ క్లోజర్ వెనక తీవ్ర రక్తగాయాలతో పడి ఉన్నాడు. పోలీసులకు, వైద్యులకు సమాచారం అందించినా అప్పటికే నగేష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఎలుగుబంటి ఎన్ క్లోజర్ లోపలకి వెళ్ళిన వెంటనే క్లోజ్ చేయకపోవడం వల్లే అది బయటకు వచ్చి నగేష్ పై దాడి చేసింది. నగేష్ మృతి మమ్మల్ని తీవ్రంగా బాధించింది. అటవీ శాఖ తరపున 10 లక్షల ఎక్స్ గ్రేషియాను అందిస్తున్నాం.” అని జూ క్యూరేటర్ నందనీ సలారియా పేర్కొన్నారు.