Atchutapuram Fire Accident : అచ్యుతాపురం సాహితి ఫార్మాలో పూర్తిగా అదుపులోకి వచ్చిన మంటలు.. బాధిత కుటుంబాల ధర్నా !

అనకాపల్లిజిల్లా అచ్యుతాపురంలోని సాహితి ఫార్మాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం గురించి తెలిసిందే. ఈ ఘటన పలువురి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నిన్న ఉదయం 11.10 నిముషాలకు సాహితీ ఫార్మా యూనిట్-1లో కంటైనర్ నుంచి సాల్వెంట్స్‌ డంప్‌ చేస్తుండగా ఒక్కసారిగా ఒత్తిడి పెరగడంతో యార్డులోని

  • Written By:
  • Publish Date - July 1, 2023 / 02:08 PM IST

Atchutapuram Fire Accident : అనకాపల్లిజిల్లా అచ్యుతాపురంలోని సాహితి ఫార్మాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం గురించి తెలిసిందే. ఈ ఘటన పలువురి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నిన్న ఉదయం 11.10 నిముషాలకు సాహితీ ఫార్మా యూనిట్-1లో కంటైనర్ నుంచి సాల్వెంట్స్‌ డంప్‌ చేస్తుండగా ఒక్కసారిగా ఒత్తిడి పెరగడంతో యార్డులోని రసాయనాలకు అంటుకున్న నిప్పు రియక్టర్ల వరకు వ్యాపించింది. దీంతో భారీ శబ్దంతో పేలడంతో.. మంటలు మరింత ఉధృతంగా ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో 35మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా.. ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడగా వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రమాదం జరిగిన వెంటనే ఘటాన స్థలానికి చేరుకున్న 11 ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రావడంతో ఫోమ్ ఫైర్ ఫైటర్లను రప్పించారు. వారి రంగ ప్రవేశం తరువాత మంటలు తగ్గుముఖం పట్టాయి. NDRF, SDRF బృందాలు ఐదు గంటల పాటు శ్రమించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ముగ్గురు ఫైర్ సిబ్బంది కూడా గాయపడ్డారు. కాగా ఇప్పుడు తాజాగా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రమాద సమయంలో భారీ పేలుడు సంభవించడం.. దట్టంగా పొగలు అలుముకోవడం.. ఘాటు వాయువులు గాల్లోకి చేరడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు మృతులకు 25 లక్షలు, గాయపడ్డ వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది ప్రభుత్వం.  (Atchutapuram Fire Accident) అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

ఇక మరోవైపు అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలు కంపెనీ ముందు ధర్నాకు దిగాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. వీరి ఆందోళనకు సీఐటీయూ, జనసేన,బీజేపీ నేతల సంఘీభావం పలికారు.