AP Police Recruitment : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ రిక్రూట్ మెంట్ లో విషాదం చోటు చేసుకుంది. గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఎస్సై అభ్యర్థుల ఫిజికల్ టెస్ట్ లో పాల్గొన్న యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మైదానంలో కుప్పకూలిన అతడిని హాస్నిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు.
గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంకు చెందిన యువకుడు మోహన్ కుమార్ పోలీస్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇటీవల ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇవాళ గుంటూరులో జరిగిన ఫిజికల్ ఈవెంట్స్ లో పాల్గొన్నాడు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 1600 మీటర్ల పరుగుపందెంలో పాల్గొన్న మోహన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతూ మైదానంలోనే కుప్పకూలిపోవడంతో జిజిహెచ్ కు తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. మోహన్ మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీస్ ఉద్యోగం సాధించడానికి ఎంతో కష్టపడిన కొడుకు ఆ కల నెరవేరకుండానే మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మోహన్ స్నేహితులు సైతం మృతదేహంవద్ద కన్నీటిపర్యంతం అవుతున్నారు.
కాగా మొత్తం 411 ఎస్సై ఉద్యోగాలకు గత ఏడాది నవంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేయగా.. డిసెంబర్ 14 వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందులో 315 ఉద్యోగాలను మహిళలు, పురుషులకు కేటాయించగా.. 96 ఉద్యోగాలను రిజర్వ్ సబ్ ఇన్సెపెక్టర్ ఆఫ్ పోలీస్ పురుషులకు కేటాయించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న రాతపరీక్ష నిర్వహించారు. 1,51,288 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా.. వారిలో 56,116 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షల కోసం ఎంపికయ్యారు. గుంటూరుతో పాటు ఏలూరు, విశాఖపట్నం, కర్నూలు జిల్లా కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు జరుపుతున్నారు. ఇక దేహదారుఢ్య పరీక్షల్లో క్వాలిఫై అయినవారికి అక్టోబర్ 14,15వ తేదీలలో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.